: దివీస్ బాధితుల‌కు ప్ర‌తిప‌క్ష నేత అండ‌.. ప్ర‌జ‌ల కోసం ఎన్ని కేసులు పెట్టినా వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న జ‌గ‌న్‌

ప్ర‌జ‌ల కోసం ఎన్ని కేసులు పెట్టించుకోవ‌డానికైనా తాము సిద్ధ‌మేన‌ని ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లా తొండంగి మండ‌లంలో దివీస్ ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ తీర‌ప్రాంతంలోని 13 గ్రామాల ప్ర‌జ‌లు 85 రోజులుగా చేస్తున్న ఆందోళ‌న‌కు జ‌గ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. మంగ‌ళ‌వారం దాన‌వాయిపేట‌లో దివీస్ బాధితుల‌ను క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ పోరాటానికి వైసీపీ అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. ప‌రిశ్ర‌మ వ‌ద్ద‌న్న వారిని పోలీసులు హింసిస్తున్నార‌ని ఆరోపించారు. బాధితుల‌కు అండ‌గా నిలిచినందుకు వైసీపీ నేత దాడిశెట్టి రాజాపై 22 కేసులు పెట్టార‌ని పేర్కొన్నారు. ఇందులో ఏడు హ‌త్యాయ‌త్నం కేసులు ఉన్నాయ‌న్నారు. దివీస్ బాధితుల‌కు అండ‌గా నిలిచిన సీపీఎం సీనియ‌ర్ నేత పి.మ‌ధును పోలీసులు చితక్కొట్టార‌న్నారు. ఆయ‌న‌ను దారుణంగా కొట్టి వేధించార‌ని ఆరోపించారు. ఇక్క‌డికొస్తే త‌న‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తామ‌ని పోలీసులు బెదిరించారంటూ ఆయ‌న‌ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి లేఖ రాసినా ప‌ట్టించుకోలేద‌న్నారు. చంద్ర‌బాబు మ‌న‌సు మారాల‌ని, ఫ్యాక్ట‌రీ క‌ట్టాల‌నుకున్న సంస్థ యాజ‌మాన్యం మ‌న‌సు కూడా మారాల‌ని అన్నారు. చంద్ర‌బాబు గూబ అదిరేలా, మ‌న క‌ష్టాలను గ‌ట్టిగా వినిపిద్దామ‌ని పిలుపునిచ్చారు.

More Telugu News