: మోదీ సాబ్...మీ నిర్ణయం అద్భుతం!: కశ్మీర్ వాసి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏర్పడిందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోపక్క మిత్రపక్షాలు కూడా గొంతు మారుస్తున్నాయి. అద్భుతమైన నిర్ణయం అంటూ వేనోళ్లపొగిడిన ప్రజలు కూడా పది రోజులు గడిచినా పరిస్థితులు ఒక కొలిక్కి రాకపోవడంతో, నెమ్మదిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంతలో కశ్మీరు వాసి రాసిన లేఖ మళ్లీ బీజేపీలో జవసత్వాలు నింపుతోంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో కశ్మీర్ ప్రజల జీవితం ఒక్కసారిగా మారిపోయిందంటూ అఫ్జల్ రెహమాన్ అనే వ్యక్తి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెద్ద నోట్లు చలామణిలో లేకపోవడంతో గత పది రోజులుగా కశ్మీర్‌ లో రాళ్లదాడులు ఆగిపోయాయని లేఖలో ఆయన పేర్కొన్నారు. వేర్పాటు వాదులు ఇచ్చే డబ్బుల కోసం తనకు తెలియకుండానే తన కుమారుడు కూడా రాళ్లదాడుల్లో పాల్గొని గాయపడ్డాడని ఆయన లేఖలో తెలిపారు. తాజా నిర్ణయంతో తమ వద్ద ఉన్న నోట్లు పట్టుకుని అంతా బ్యాంకుల ముందు క్యూలలో నిల్చున్నారని ఆయన రాశారు. దీంతో కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతోందని, షాపులు, స్కూళ్లు తిరిగి తెరచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో తన కుమార్తె బాగా రాసిందని, విద్యార్థుల హాజరు శాతం 95కు పైగా నమోదైందన్నారు. వేర్పాటు వాదులు, భద్రతా సిబ్బంది మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడ్డ కశ్మీరీలు స్వేచ్ఛగా ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన కశ్మీరీలు ఇప్పుడిప్పుడే మనసు విప్పి తోటి వారితో మాట్లాడుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News