: భారతరత్న వస్తే ఇక మనం ఉండం కాబోలు, ముసలాళ్లమైపోయామన్న బాధ కూడా పట్టుకుంటుంది!: బాలమురళీకృష్ణ చమత్కారం

ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏం పాడినా ఇంకా వినాలనిపిస్తూనే వుంటుంది. అలాగే ఆయన దేని గురించి మాట్లాడినా ఇంకా ఇంకా వినాలనిపిస్తూనే వుంటుంది. ప్రతి విషయాన్నీ మరో విషయంతో చక్కగా అన్వయిస్తూ చెబుతారు. ఓసారి ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా లయ, నాదం గురించి కొత్త విషయాలు చెప్పారు. "మ్యూజిక్‌ అంటే కేవలం త్యాగరాజ, అన్నమయ్య, బాలమురళి కీర్తనలు పాడటం మాత్రమే కాదు, మనం మాట్లాడే ప్రతిదీ సంగీతమే. అసలు మొత్తంగా ప్రపంచం అంటేనే లయ, నాదం. దేనిని తిప్పినా లేదా తిరిగినా శబ్దం చేస్తుంది. అలాగే తిరుగుతున్న భూమి కూడా ఓంకార నాదం శబ్దంతో తిరుగుతోంది. అయినప్పటికీ ఏమాత్రం గతి తప్పడం లేదు. ఒకే కక్ష్యలో తిరుగుతోంది. దీనినే లయ అంటారు. సంగీతంతో రోగాలను నయం చేయవచ్చు. దానినే మ్యూజిక్ థెరపీ అంటారు. ఫలానా రాగంతో పాడితే రోగం తగ్గుతుందని ఏమీలేదు. అయితే ఏ రోగానికి ఏ రాగం పాడాలి? అన్నది ఈ థెరపీ చేసేవారు తెలుసుకోవాలి. అది నాకు తెలుసు... ఓసారి ఎంజీ రామచంద్రన్‌ గారు కోమాలో ఉన్నారు. వైద్యులు లాభం లేదని చెప్పిన తరువాత, ఓ 9 నిమిషాల నిడివి కలిగిన మ్యూజిక్‌ ను రికార్డు చేసి, దానిని వేసి ఆయనకు వినిపించమన్నాను... అలా చేస్తే ఏం జరుగుతుందని ఆయన భార్య అడిగారు... హాయిగా ప్రాణం పోతుందని చెప్పి వచ్చేశాను... వారు దానిని ఆయనకు వినిపించారు. దానిని విన్న ఆయన మర్నాడు కోమాలోంచి బయటకు వచ్చారు. సంగీతానికి ఉన్న శక్తి అంతటిది" అన్నారాయన. 'ఇన్ని అవార్డులు, రివార్డులు వచ్చాయి కదా? ఇంకా భారతరత్న ఎందుకు రాలేదు? దానికి మీరు భూషణం కదా?' అని అడిగితే... "అది రావాలనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు. పద్మ విభూషణ్‌ వచ్చింది. అది అత్యున్నతం. భారతరత్న మరో విధమైన అత్యున్నత బిరుదు. జాతి గుర్తించినట్లు ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా? అయినా ఈ గుర్తింపులు, బిరుదులు రావాలంటే వస్తాయి. లేదంటే లేదు. మిగిలినవాళ్లకు వచ్చాయంటే వారికి ఎవరో ఇవ్వాలనుకున్నారు, వారు ఇవ్వగలరు కాబట్టి వారికి వాటిని ఇచ్చారు. అయినా భారతరత్న చివరి పురస్కారం. అది వస్తే... ఇక ఉండం కాబోలు, అది వచ్చిన తరువాత ముసలాళ్లం అయిపోతామనే భయం కూడా పీడుస్తుంటుంది" అంటూ చమత్కరించారు.

More Telugu News