: 70 ఏళ్ల అవినీతిని అంత‌మొందించేందుకే ప్ర‌ధాని ఈ నిర్ణయం తీసుకున్నారు!: అరుణ్‌జైట్లీ

పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించేవ‌ర‌కు కేంద్ర ఆర్థిక మంత్రికి కూడా తెలియ‌ద‌ని ప‌లువురు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, మరోవైపు ఈ విషయం బీజేపీ నేత‌ల‌కు ముందే తెలిసింద‌ని అంటున్నార‌ని, ఒకవేళ ఆర్థిక మంత్రికే తెలియకపోతే పార్టీ స‌భ్యుల‌కు ఎలా తెలుస్తుంద‌ని, ఇలాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు మానుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ విమర్శకులకు రిటార్ట్ ఇచ్చారు. ఈ రోజు ఆయ‌న బీజేపీ పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ... నోట్ల రద్దు నిర్ణయాన్ని దేశ ప్రజలంతా స్వాగతించారని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. ప్ర‌ధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దేశంలో అవినితి అంత‌మ‌వుతుందని జైట్లీ అన్నారు. వ్య‌వ‌సాయ‌రంగంపై తాము అధికంగా దృష్టి పెట్టాల‌ని యోచిస్తున్నామని, రానున్న‌ ర‌బీ సీజ‌న్ లో రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. డిజిట‌ల్ ఎకాన‌మీ కూడా పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో పుంజుకుంటుంద‌ని చెప్పారు. 70 ఏళ్ల నుంచి దేశంలో కూరుకుపోయిన అవినీతిని అంత‌మొందించేందుకే ప్ర‌ధాని మోదీ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని అన్నారు. పెద్దనోట్ల రద్దుపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించామని వ్యాఖ్యానించారు.

More Telugu News