: ముగిసిన స‌హాయ చ‌ర్య‌లు.. 146కు పెరిగిన‌ రైలు ప్ర‌మాద మృతుల సంఖ్య‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో ఆదివారం తెల్ల‌వారుజామున జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 146కు చేరుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ప్రారంభ‌మైన చర్య‌ల‌ను సోమ‌వారం సాయంత్రం నిలిపివేశారు. ఆదివారం తెల్ల‌వారుజామున ప్ర‌యాణికులు గాఢ నిద్ర‌లో ఉన్న స‌మ‌యంలో పుఖ్ర‌యాన్ వ‌ద్ద ఇండోర్‌-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప‌ట్టాలు త‌ప్పిన సంగ‌తి తెలిసిందే. వంద‌లాది మంది రైల్వే సిబ్బంది భారీ క్రేన్ల సాయంతో శిథిలాలు తొల‌గించారు. పూర్తిగా ధ్వంస‌మైన ఎస్‌1, ఎస్‌2, ఎస్‌3, ఎస్‌4, ఏసీ-3 కోచ్‌ల‌ను అణువ‌ణువూ గాలించారు. చిక్కుకున్న వారిని ర‌క్షించారు. ధ్వంస‌మైన బోగీల నుంచి 146 మృత‌దేహాల‌ను వెలికి తీసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (హోం) దేవాశిష్ పండా, నార్త్ రైల్వేస్ పీఆర్వో అమిత్ మ‌ల్వియా తెలిపారు. ఇప్ప‌టివ‌రకు 125 మృత‌దేహాల‌ను గుర్తించామ‌ని, 97 మృత‌దేహాల‌ను వారి కుటుంబ స‌భ్యుల‌కు అందించామ‌ని వివ‌రించారు. రైలు ప్ర‌మాదాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం ప్ర‌మాదంతో సంబంధ‌ముంద‌ని భావిస్తున్న‌ గుర్తు తెలియ‌ని రైల్వే సిబ్బందిపై ఎప్ఐఆర్ న‌మోదు చేసింది. మ‌రోవైపు ప్ర‌మాదానికి గ‌ల క‌చ్చిత‌మైన కార‌ణాల‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. రైల్వే అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం చోటుచేసుకుంద‌ని చాలా మంది ప్ర‌యాణికులు ఆరోపిస్తున్నారు. రైలు చ‌క్రాలు స‌రిగ్గా ప‌నిచేయ‌లేద‌ని, వాటి నుంచి విప‌రీత‌మైన శ‌బ్దం రావ‌డాన్ని గ‌మ‌నించామ‌ని కొంద‌రు తెలిపార‌ని జీఆర్‌పీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ గోపాల్ గుప్తా పేర్కొన్నారు. రైలు డ్రైవ‌ర్‌ను ప్రశ్నించనున్న‌ట్టు వివ‌రించారు.

More Telugu News