: బ్రిటన్ లోని మాంసం దుకాణాల్లోని 'తాజా చికెన్' తింటున్నారా?.. అయితే అనారోగ్యం పాలవడం ఖాయమట!

బ్రిటన్ లోని మాంసం దుకాణాల్లో 'ఫ్రెష్ చికెన్' అంటూ నోరూరించే చికెన్‌ను తిన‌డానికి వెళ్లాల‌నుకుంటున్న వారు కాస్త జాగ్ర‌త్త‌లు పాటించాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ చికెన్‌లో మూడింట రెండొంతుల శాతం ఈ-కోలి సూప‌ర్‌బ‌గ్ ఉంద‌ని, ఈ చికెన్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్ర‌మాదం పొంచి ఉంటుంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. ఇంగ్లండ్‌లోని దుకాణాల్లో విక్ర‌యిస్తున్న‌ చికెన్‌లో 78 శాతం ఈ-కోలి బ్యాక్టీరియా కలిగి ఉంద‌ని చెబుతున్నారు. చికెన్‌లో ఈ-కోలి బ్యాక్టీరియా ఇంగ్లండ్ త‌రువాత‌ స్కాట్లండ్‌లో 53, వేల్స్‌లో 41 శాతంగా ఉన్న‌ట్లు నిపుణులు చెప్పారు. ఈ బ్యాక్టీరియా ఉన్న చికెన్ తిన‌డం వ‌ల్ల ఇంగ్లండ్‌లో ప్ర‌తి సంవ‌త్స‌రం 5,500 మంది మృత్యువాత ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా ఒంట్లోకి ప్ర‌వేశిస్తే డయేరియా లేదా వాంతులు వ‌స్తాయ‌ని, బ్యాక్టీరియా పెద్ద ప్రేవుల్లో కొన్ని ఏళ్ల‌ పాటు సజీవంగా ఉండ‌డంతో ప్రాణాపాయం పొంచి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఒంట్లో చేరిన ఈ బ్యాక్టీరియాను అరిక‌ట్టాలంటే ఏ ర‌క‌మైన‌ యాంటీబయాటిక్ మందులు ప‌నిచేయ‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ‌రోవైపు యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి ప‌రిశోధ‌కులు కూడా కొన్ని నెల‌ల క్రితం ఇదే అంశాన్ని చెప్పారు. సూపర్ మార్కెట్లలో ల‌భిస్తోన్న ఈ చికెన్‌లో బ్యాక్టీరియా ఉన్నట్లు వారు స్ప‌ష్టం చేశారు. ఈ ప‌రిస్థితి ప్ర‌స్తుతం మ‌రింత అధిక‌మైంద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. చికెన్‌లోకి ఈ సూపర్ బగ్ ఎలా వ‌చ్చింద‌న్న అంశంపై ప‌రిశోధ‌న జ‌రిపిన శాస్త్ర‌జ్ఞులకి కొన్ని దశాబ్దాలుగా కోళ్లకు ఇస్తోన్న ఆహారంలో యాంటీ బయాటిక్ మందులను అధిక మొత్తంలో ఉప‌యోగించ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలిసింది. పౌల్ట్రీల్లో కోడి పిల్లలకు ముందు జాగ్ర‌త్త‌గా వ్యాధులు రాకుండా అధిక‌మొత్తంలో యాంటీ బయాటిక్స్ ఇవ్వ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలిసింది.

More Telugu News