: చివరి నిమిషంలో సీటు మార్చుకోవడమే ఆ జర్నలిస్టు ప్రాణాలు కాపాడింది!

నిన్న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 145కు చేరింది. అయితే, ఓ జ‌ర్న‌లిస్టు చివ‌రి నిమిషంలో అనుకోకుండా సీటు మార్చుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న సంఘటన వెలుగులోకొచ్చింది. సీటు మార్చుకోవ‌డంతో తన ప్రాణాలు నిలిచాయ‌ని జర్నలిస్టు సంతోష్‌ ఉపాధ్యాయ్ వ్యాఖ్యానించాడు. నిన్న తాను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన తీరుపై వివ‌రించి చెప్పాడు. స‌ద‌రు జ‌ర్న‌లిస్టు తీసుకున్న టికెట్ లోని సీటు నెంబ‌రు ప్ర‌కారం ఉజ్జయినిలో ఇండోర్ -పాట్నా రైలెక్కి ఎస్ 2 లోని బెర్త్ నెం.7 లో కూర్చోవాల్సి ఉంది. అయితే, ఓ ప్ర‌యాణికురాలు ఆయ‌న సంతోష్ ద‌గ్గ‌రికి వ‌చ్చి తన స్నేహితురాలు అక్క‌డ కూర్చుంద‌ని తాను అక్క‌డ కూర్చుంటాన‌ని చెప్పింది. ఎస్ 5 కోచ్ కి వెళ్లాల్సిందిగా అతనిని కోరింది. దీంతో సంతోష్ అందుకు అంగీకరించి ఎస్ 5 కోచ్ కి తన బెర్త్ ను మార్చుకొని వెళ్లిపోయాడు. కొద్ది సేప‌టికే ఆయ‌న‌కు భారీ శబ్దం వినిపించింది. కిటికీలోంచి చూస్తే ఎంతో మంది ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతూ క‌న‌పడ్డారు. సంతోష్ ఎమర్జెన్సీ విండో ద్వారా బయట‌కు వెళ్లాడు. ప్ర‌మాదం గురించి బీహార్ రైల్వే సీపీఆర్వో వినయ్ కుమార్ కి తాను సమాచారం అందించిన‌ట్లు తెలిపాడు. అనంత‌రం త‌న‌ తోటి ప్రయాణీకులతో క‌లిసి అక్క‌డ‌ సహాయక చర్యల్లో పాల్గొన్న‌ట్లు చెప్పాడు.

More Telugu News