: రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి 500 నోట్ల పంపకం... చర్చనీయాంశంగా మారిన ఘటన

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడ్డ వారు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో కొందరికి నిన్న ఊహించని విధంగా రద్దయిన రూ. 500 నోట్లు అందాయి. ఒక్కొక్కరికి రూ. 5000ల వంతున పది 500 నోట్లను గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చి వెళ్లారు. ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఘటనలో గాయపడ్డ ఓ వ్యక్తి బంధువు మాట్లాడుతూ, రైల్వే శాఖ వారు ఈ డబ్బును ఇచ్చారంటూ తమకు డబ్బిచ్చిన వ్యక్తి చెప్పాడని తెలిపింది. అయితే, ఈ డబ్బును రైల్వే శాఖ పంపించిందనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని కాన్పూర్ జోన్ కమిషనర్ ఇఫ్తికారుద్దీన్ తెలిపారు. దీనిపై బీజేపీ నేత ఆర్పీ సింగ్ మాట్లాడుతూ, డబ్బులు ఎవరు పంచారనే విషయంలో క్లారిటీ లేదని తెలిపారు. రైల్వే సిబ్బంది ఈ డబ్బును పంచారా? లేక ఎవరైనా రాజకీయ నేతలు ఈ పని చేశారా? అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. ఒకవేళ రైల్వే సిబ్బంది ఈ డబ్బును పంచి ఉంటే ఇది చాలా బాధాకరమైన అంశమని చెప్పారు. రాజకీయ నేతలు ఈ పని చేసి ఉంటే... ఇది మరింత బాధ కలిగించే అంశమని... గాయపడిన వారి పుండుపై కారం చల్లినట్టే అని అన్నారు. చెల్లని నోట్లను క్షతగాత్రులు ఏం చేసుకుంటారని ప్రశ్నించారు. దీనికితోడు, ఈ విషయం తెలిసిన వెంటనే రైల్వే శాఖ మంత్రి సరేష్ ప్రభుకు జరిగిన దాన్ని వివరిస్తూ ట్వీట్ చేశానని... ఏం జరిగిందో, ఎలా జరిగిందో తాను తెలుసుకుంటానని రైల్వే మంత్రి నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చిందని చెప్పారు.

More Telugu News