: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తీర్పును వాయిదా వేసిన కోర్టు

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో 2013లో జ‌రిగిన జంట పేలుళ్ల కేసులో నేడు తుదితీర్పు వెలువ‌డుతుంద‌ని భావించారు. అయితే, ఈ తీర్పును వ‌చ్చేనెల 13కు వాయిదా వేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తెలిపింది. ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిన విష‌యం తెలిసిందే. ఈ జంట‌పేలుళ్ల కేసులో ఆ ఉగ్ర‌వాద సంస్థ సభ్యులు రియాజ్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, యాసిన్‌ భత్కల్‌, ఐజాజ్‌ షేక్ నిందితులుగా ఉన్నారు. వీరిలో రియాజ్ భ‌త్క‌ల్‌ త‌ప్ప మిగిలిన నిందితులంద‌రూ చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్నారు. ప‌రారీలో ఉన్న రియాజ్ భ‌త్క‌ల్‌ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ కేసులో మూడున్నరేళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ కొన‌సాగింది. మొత్తం 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ రోజు తుది తీర్పు ఇస్తార‌న్న‌ నేపథ్యంలో నిందితులను పోలీసులు న్యాయ‌స్థానం ముందు హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి న్యాయ‌స్థానం మొత్తం 502 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఈ పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా, 138 మంది గాయాలపాలయ్యారు.

More Telugu News