: ఆస్ప‌త్రులలోని రోగుల వ‌ద్ద‌కు పోస్ట‌ల్ సిబ్బంది.. రూ.25 ల‌క్ష‌ల నోట్ల మార్పిడి!

పెద్ద నోట్ల ర‌ద్దుతో ఆస్ప‌త్రుల్లోని రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను పోస్ట‌ల్‌శాఖ సిబ్బంది తీర్చుతున్నారు. ఢిల్లీలోని ప‌లు ఆస్ప‌త్రులకు వెళ్లి అక్క‌డిక‌క్క‌డే నోట్లు మార్పిడి చేసి ఇవ్వ‌డంతో రోగుల్లో సంతోషం వ్య‌క్తమైంది. చికిత్స పొందుతున్న వారికి తోడుగా వ‌చ్చిన వారు, వారిని వ‌దిలి క్యూల‌లో నిల్చునే అవ‌కాశం లేక‌పోవ‌డంతో పోస్ట‌ల్ సిబ్బంది ఈ నిర్ణ‌యం తీసుకుని త‌మ స‌హృద‌యాన్ని చాటుకున్నారు. ఆదివారం నాడు దేశ రాజ‌ధానిలోని ప‌లు ఆస్ప‌త్రుల‌కు వెళ్లిన సిబ్బంది రూ.25 ల‌క్ష‌ల మేర నోట్లు మార్చారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను నియ‌మించి ఆస్ప‌త్రుల‌కు పంపి నోట్ల మార్పిడి చేస్తున్నట్టు ఢిల్లీ స‌ర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎల్ఎన్‌ శ‌ర్మ తెలిపారు. వ‌చ్చే నెల 30 వ తేదీ వ‌ర‌కు ఈ సేవ‌లను కొన‌సాగిస్తామ‌న్నారు. శుక్ర‌వారం నుంచే ప్ర‌త్యేక బృందాలు రంగంలోకి దిగాయ‌ని పేర్కొన్న శ‌ర్మ‌.. ప‌లు వృద్ధాశ్ర‌మాల్లోనూ నోట్ల మార్పిడి చేసిన‌ట్టు తెలిపారు. కాగా నోట్ల ర‌ద్దుతో డిజిట‌ల్ పేమెంట్ ప్లాట్‌ఫాంలు బ‌లోపేత‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం ఇటువంటి సేవ‌లు అందించే సంస్థ‌లు 45 వ‌ర‌కు ఉన్నాయి. మ‌రోవైపు ఏటీఎంల ముందు క్యూల‌లో నిల‌బ‌డ‌కుండా త‌మ ప్రిన్సిప‌ల్ అకౌంట్స్ ఆఫీసు సిబ్బందికి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ ఢిల్లీ ప్ర‌భుత్వం ఆర్బీఐకి లేఖ రాసింది.

More Telugu News