: పెద్దనోట్ల రద్దుతో 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుల్లో జమయ్యాయి: ప్రధాని మోదీ

పెద్దనోట్ల రద్దుతో ఇప్పటివరకూ 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుల్లో జమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆగ్రా ‘ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన’ పథకం ప్రారంభించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ఆయన మరోసారి స్పందించారు. మోదీ మాట్లాడుతూ, నల్లధనాన్ని అరికట్టేందుకే తాను పెద్ద నోట్లను రద్దు చేశానని, పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకుంటున్న నల్ల కుబేరుల నుంచి రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. నోట్ల రద్దుతో కేవలం పదిరోజుల్లోనే పాత పన్నులన్నింటినీ ప్రజలు కట్టేశారని, మునిసిపాలిటీలకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. పెద్దనోట్ల రద్దుతో కొన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రజలందరూ అండగా నిలిచారని, ప్రజలు పడుతున్న కష్టాన్ని వృథా కానివ్వనని అన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకోలేదని, దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని మోదీ చెప్పారు. సామాన్యుడికి దక్కాల్సిన హక్కుల కోసమే ఆ నోట్లను రద్దు చేశామని మోదీ చెప్పారు.

More Telugu News