: తన వర్శిటీపై ఉన్న కేసుల్లో రాజీ కోసం రూ. 170 కోట్లు ఆఫర్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకు రాజీ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ట్రంప్ యూనివర్శిటీపై ఉన్న మూడు కేసుల సెటిల్ మెంట్ కోసం ఆయన 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 170 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించారు. మూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ కేసులో వాది, ప్రతివాదుల మధ్య డీల్ కుదిరిందని న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎరిక్ షినైడర్ మ్యాన్ వెల్లడించారు. దీంతో పాటు ట్రంప్ వర్శిటీ మాజీ విద్యార్థులు కాలిఫోర్నియాలో వేసిన రెండు కేసుల్లోనూ రాజీ కుదిరిందన్నారు. నిర్మాణ రంగంలో నిష్ణాతులను చేస్తామని చెబుతూ, ఒక్కొక్కరి నుంచి 35 వేల డాలర్లను కట్టించుకున్న యూనివర్శిటీ సరిగ్గా పాఠాలు చెప్పలేదని, ఈ స్టడీ ప్రోగ్రామ్ తమను తప్పుదారి పట్టించిందని విద్యార్థులు కోర్టు కెక్కారు. ఈ కేసులో ట్రంప్ వర్శిటీ వైఫల్యం కొట్టొచ్చినట్టు ఉండటం, విద్యార్థులు నెగ్గితే, అధ్యక్ష హోదాలో పరువు పోతుందని భావించడంతోనే ఆయన భారీగా డబ్బు చెల్లించి కేసుల నుంచి బయటపడాలని భావించినట్టు తెలుస్తోంది.

More Telugu News