: గుండెపోటును తెప్పించేలా వృద్ధి రేటు డౌన్... చైనా కన్నా ముందున్న ఇండియాను వెనక్కు నెట్టేస్తున్న మోదీ... హెచ్చరించిన నిపుణులు

స్థూలజాతీయ ఉత్పత్తి వృద్ధిలో చైనాకన్నా మెరుగ్గా ఉన్న ఇండియాను మోదీ ప్రకటించిన నోట్ల రద్దు అంశం వెనక్కు నెట్టేయనుందని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా,, రీసెర్చ్ సంస్థలు సైతం అదే అభిప్రాయంలో ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దుతో జీడీపీ స్థిరమైన వృద్ధిని సాధించే దిశగా రూపాంతరం చెందే ముందు భారత వృద్ధి వేగం కనిష్ఠానికి పడిపోనుందని, చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు ఒక్కసారిగా రద్దు కావడమే ఇందుకు కారణమని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్, భారత చీఫ్ ఎకానమిస్ట్ ఇంద్రనీల్ సేన్ గుప్తా అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో నమోదు కానున్న వృద్ధి రేటు భారత్ కు గుండెపోటు వంటిదేనని చెప్పారు. కనీసం ఆరు నుంచి 9 నెలల పాటు ఈ ప్రభావం ఉంటుందని, ఈ సంవత్సరం జీడీపీ కనీసం అర శాతం కుంచించుకుపోతుందని ఆయన అంచనా వేశారు. గతంలో వేసిన భారత జీడీపీ అంచనాలు 8 శాతాన్ని ఇప్పుడు 7 శాతానికి సవరిస్తున్నామని, వర్షాలు ఎంత బాగున్నా, ఇది తిరిగి 8 శాతానికి చేరుకునే అవకాశాలు లేవని తెలిపారు. ఇదిలావుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిపుణులు సైతం గతంలో వేసిన భారత వృద్ధి అంచనా 7.8 శాతాన్ని 7.3 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించారు. ఇక్రా సైతం 40 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతను అంచనా వేస్తున్నట్టు తెలిపింది. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ అంబిత్ క్యాపిటల్, మూడీస్, క్రిసిల్ వంటి సంస్థలు కూడా మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో జీడీపీ ప్రభావితం కానుందని అంచనా వేశాయి.

More Telugu News