: రూ. 1.20 కోట్లను ఏం చేశారు? మెదక్ ఎస్బీహెచ్ లో కొత్త నోట్ల భారీ స్కామ్!

మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన తరువాత రెండు రోజులకు రూ. 1.20 కోట్లను విజయ డెయిరీ ఖాతా నుంచి విత్ డ్రా చేసిన వ్యవహారం సంచలనం కలిగిస్తూ, బ్యాంకు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. పాడి రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసమే ఈ డబ్బు తీసుకున్నామని చెబుతున్నప్పటికీ, నిబంధనలు పాటించకుండా విత్ డ్రా చేయడం, ఈ డబ్బు విజయ డెయిరీకి పాలు విక్రయించిన రైతులకు చేరకపోవడంతో, ఇంత డబ్బు ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పక్కనే ఉన్న సిద్ధిపేట, సంగారెడ్డి బ్యాంకు అధికారులు విజయ సొసైటీ సభ్యులకు డబ్బు డ్రా చేసుకునేందుకు అనుమతించక పోగా, మెదక్ అధికారుల ఔదార్యం ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఈ కుంభకోణంలో బ్యాంకు అధికారులు, విజయ సొసైటీ సభ్యులు కుమ్మక్కయ్యారని, నల్లధనాన్ని మార్చుకునేందుకు ప్లాన్ వేశారన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, డబ్బును డ్రా చేసింది నిజమేనని, దీన్ని రైతులకు ఇవ్వాల్సి వుందని, రూ. 2 వేలకు చిల్లర లభించక ఇంకా పంచలేదని విజయ డెయిరీ మేనేజర్ చెబుతుంటే, ప్రభుత్వ ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసేందుకు అనుమతించరాదన్న నిబంధన తమకు తెలియక ఈ విత్ డ్రాకు ఆమోదం చెప్పినట్టు బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే, ఒకేసారి రూ. 1.20 కోట్లను ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు మాత్రం ఆయన వద్ద సమాధానం లేకపోడవం గమనార్హం. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.

More Telugu News