: ఒక్క ముక్క చెప్పకుండా, అత్యంత రహస్యంగా సమావేశం నిర్వహించారు: 'పెద్ద నోట్ల రద్దు' నాటి ఘటనపై అరుంధతీ భట్టాచార్య

నవంబర్ 8, రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన వేళ... అంతకు సరిగ్గా గంట ముందు దేశంలోని టాప్ బ్యాంకర్లను సమావేశానికి పిలిపించారు నరేంద్ర మోదీ. ఈ సమావేశం 7 గంటలకు ప్రారంభం కాగా, చర్చించాల్సిన అంశం ఏంటన్న విషయం తమకు ఎవరికీ తెలియదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, నాటి ఘటనలను గుర్తు చేసుకున్నారు. తమను పిలిపించిన తరువాత కూడా ఎలాంటి విషయమూ చెప్పలేదని, రహస్యాన్ని కొనసాగిస్తూ, ఓ పెద్ద ఆపరేషన్ చేపట్టాల్సి వుందని, అందుకు బ్యాంకుల సహకారాన్ని కోరేందుకు సమావేశానికి ప్రధాని పిలిపించినట్టు పీఎంఓ వర్గాలు వెల్లడించాయని ఆమె తెలిపారు. మోదీ 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత వరకూ విషయం ఏంటన్నది తమకు తెలియదని అన్నారు. మింట్ స్ట్రీట్ లోని ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ లోని 15వ అంతస్తులో టాప్ బ్యాంకర్ల సమావేశం జరిగిందని, ఈ రంగంలో కనీసం 30 సంవత్సరాల అనుభవమున్న టాప్ బ్యాంకర్లను మాత్రమే పిలిచారని ఆమె చెప్పారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల మొత్తం పెరగడం గురించి ఆందోళన చెందుతున్నామంటూ ఆర్బీఐ అధికారులు సమావేశాన్ని ప్రారంభించారని, ఆపై మరికొన్ని సాధారణ అంశాలను చర్చించామని తెలిపారు. 8 గంటల వేళ, గదిలోని టీవీలను ఆన్ చేశారని, ప్రధాని ప్రసంగించనున్నారని తెలిపి, ఆపై తిరిగి సమావేశం కొనసాగుతుందని ఆర్బీఐ ఉన్నతాధికారులు వెల్లడించారని అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ప్రధాని నోటివెంట పెద్ద నోట్ల రద్దును విన్నామని, అంతవరకూ తమకు విషయం తెలీదని చెప్పిన ఆమె, ప్రధాని ప్రసంగం మొదలుకాగానే, తమ పని ప్రారంభమైందని, ఆర్బీఐ కార్యాలయం నుంచే మరుసటి రోజుకు సంబంధించిన పనిని తాము ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వచ్చి తాము చేయాల్సిన పనులపై కొంత గైడెన్స్ ఇచ్చి వెళ్లిన తరువాత, రాత్రి 9:30 గంటల సమయంలో బయట పడ్డామని, రాత్రి 10 గంటల సమయానికి అందుబాటులో ఉన్న బ్యాంకు ఉన్నతాధికారులను తన ఇంటికి పిలిపించుకుని సమావేశమై, మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి చర్చించామని భట్టాచార్య వివరించారు. ఆ క్షణం నుంచి ఏటీఎంలను మార్చడం, ఖాతాదారులకు ఇబ్బంది కలుగకుండా చూడటం వంటి పనుల్లో తలమునకలై పోయినట్టు తెలిపారు.

More Telugu News