: డిసెంబర్ 30 వరకూ సమయమిచ్చామంటున్న మోదీ... వినకుండా నోటీసులతో విరుచుకుపడుతూ ఐటీ శాఖ దూకుడు!

పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, ఇళ్లల్లో న్యాయంగా, సక్రమంగా దాచుకున్న డబ్బును వ్యక్తిగత ఖాతాల్లో వేసుకునేందుకు డిసెంబర్ 30 వరకూ సమయమిచ్చినా, ఐటీ శాఖ మాత్రం వినడం లేదు. నోటీసులతో విరుచుకుపడుతోంది. వ్యక్తిగత ఖాతాల్లో 2.5 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా వెంటనే ఈ డబ్బు ఎక్కడిదని నోటీసులు వస్తున్నాయి. ఈ ఖాతాల్లో అంతకుముందే కొంత డబ్బు లావాదేవీలు జరిగివుండటం, కొత్తగా డిపాజిట్ అయిన డబ్బుతో పన్ను పరిధిలోకి ఖాతాదారు రావడంతో పన్ను కట్టాలన్న నోటీసులు వస్తున్నాయి. ఇక రెండున్నర లక్షల వరకూ డిపాజిట్లపై ఆంక్షలుండవని మోదీ సర్కారు హామీ ఇచ్చినప్పటికీ, ఆదాయపు పన్ను అధికారులు దాన్ని పట్టించుకోకుండా నోటీసులు పంపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాతాల్లో 3 లక్షల బ్యాలెన్స్ ఉన్నా కూడా నోటీసులు వస్తున్నాయని, పన్ను కట్టాలని ఫోన్లు వస్తున్నాయని పలువురు వాపోతున్న పరిస్థితి. తాము ఎంతో కాలంగా ఈ డబ్బును కూడబెట్టుకుంటూ వచ్చామని, ఇప్పుడు దానికి లెక్కలను చెప్పమంటే, ఎలా చెప్పగలమని ఎంతో మంది ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. పేదలు, మధ్యతరగతి ఖాతాలను శోధించడం మానేసి, నిజమైన అక్రమార్కులను పట్టుకోవడంపై ఐటీ అధికారులు శ్రద్ధ చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News