: స్వ‌దేశానికి ఆంధ్రా బుద్ధుడు, ప్ర‌త్యంగిర దేవ‌తా శిల్పం.. స్వ‌చ్ఛందంగా అప్ప‌గించిన ఆస్ట్రేలియా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 3వ శ‌తాబ్దం నాటి బుద్ధుడిని పూజిస్తున్న ఆరాధికుల శిల్పం తిరిగి భార‌త్ చేరుకుంది. ఎప్పుడో దేశం నుంచి చోరీకి గురైన బుద్ధుడి విగ్ర‌హంతోపాటు త‌మిళ‌నాడుకు చెందిన 12 శ‌తాబ్దంనాటి ప్ర‌త్యంగిర దేవ‌తా శిల్పం తిరిగి స్వ‌దేశానికి చేరుకుంది. ఆస్ట్రేలియా వ‌ద్ద ఉన్న ఈ రెండు విగ్ర‌హాలు కేంద్రం చొర‌వ‌తో తిరిగి మ‌న‌దేశానికి వ‌చ్చాయి. 2005లో న్యూయార్క్‌లో జ‌రిగిన ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్‌ (ప్రాచీన క‌ళ‌) పేరుతో నిర్వ‌హించిన ఎగ్జిబిష‌న్‌లో ఈ విగ్ర‌హాల‌కు వేలం నిర్వ‌హించ‌గా కాన్‌బెర్రాలోని నేష‌న‌ల్ గ్యాల‌రీ ఆఫ్ ఆస్ట్రేలియా(ఎన్‌జీఏ) వీటిని కొనుగోలు చేసింది. సుభాష్ క‌పూర్ అనే వ్యాపారి వీటిని విక్ర‌యించారు. ప్రాచీన క‌ళాఖండాల‌ను అక్ర‌మ ర‌వాణా చేస్తున్న నేరంపై 2011లో అత‌డిని అమెరికా-భాత‌ర బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్ర‌స్తుతం అత‌డు త‌మిళ‌నాడు జైలులో ఉన్నాడు. సాంస్కృతిక సంప‌ద అక్ర‌మ దిగుమ‌తి, ఎగుమ‌తి బ‌దిలీ నిరోధ‌కంపై 1970ల్లో యునెస్కో ఒప్పందంపై ఆస్ట్రేలియా సంత‌కం చేసింది. దీని ప్ర‌కారం ప‌రాయి దేశానికి చెందిన క‌ళాఖండాలు, సాంస్కృతిక వ‌స్తువుల‌ను ఆ దేశం త‌న వ‌ద్ద ఉంచుకోరాదు. దీనికి తోడు ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఈ విగ్ర‌హాల‌పై చ‌ర్చ జ‌రిగింది. అత్యంత పురాత‌న‌, సాంస్కృతిక నేప‌థ్యం క‌లిగిన ఈ విగ్ర‌హాల‌ను త‌మ‌కు తిరిగి అప్ప‌గించాల్సిందిగా కోరారు. ప్రధాని అభ్య‌ర్థ‌న‌కు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. భార‌త పురావ‌స్తు ప‌రిశోధ‌న సంస్థ‌, ఆస్ట్రేలియాలోని భార‌త హై క‌మిష‌న‌ర్ ఆ దేశంతో సంప్ర‌దింపులు జరిపారు. దీంతో ఈ విగ్ర‌హాల‌ను తిరిగి భార‌త్‌కు అప్ప‌గించాల‌ని ఆస్ట్రేలియా నిర్ణ‌యించింది. అన్న‌ట్టుగానే విగ్ర‌హాల‌ను తిరిగి అప్ప‌గించింది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేంద్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క శాఖా మంత్రి మ‌హేశ్వ‌ర శ‌ర్మ‌కు ఆస్ట్రేలియా మంత్రి మిచ్‌ఫి పీల్డ్ కాన్‌బెర్రాలోని ఎన్‌జీఏలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఈ రెండు విగ్ర‌హాల‌ను అంద‌జేశారు. పురాత‌న విగ్ర‌హాల‌ను తిరిగి అప్ప‌గించ‌డంపై భార‌త హై క‌మిష‌న‌ర్ న‌వ‌దీప్‌సూరి ఆనందం వ్య‌క్తం చేశారు. వీటిని ఢిల్లీలోని నేష‌న‌ల్ మ్యూజియంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచుతామ‌ని పేర్కొన్నారు.

More Telugu News