: ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్న బ్యాంకులు.. ప‌రిమితి రూ.24 వేలు.. ఇచ్చేది రూ. 5-10 వేలు

ప్ర‌జ‌ల పెద్ద‌నోట్ల క‌ష్టాలు తీర్చాల్సిన బ్యాంకులు వారికి చుక్క‌లు చూపిస్తున్నాయి. ఉన్న నోట్లు చెల్ల‌క‌, కొత్త నోట్లు అంద‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న జ‌నాల‌ను బ్యాంకులు మ‌రింత ఇబ్బంది పెడుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌రిమితి ఒక‌లా ఉంటే బ్యాంకులు మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. వారానికి రూ.24 వేల వ‌ర‌కు డ్రా చేసుకోవ‌చ్చంటూ ప్ర‌భుత్వం చెబుతుంటే బ్యాంకులు మాత్రం రూ.5-10వేలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాయి. ప్ర‌శ్నిస్తే డ‌బ్బులు లేవ‌ని తీరిగ్గా స‌మాధానం చెబుతున్నాయి. బ్యాంకుల తీరుపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పెద్ద నోట్లను ర‌ద్దు చేసి ప‌ది రోజులు గ‌డిచినా ఇప్పుడు కూడా తొలిరోజు ప‌రిస్థితే ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు ఎక్క‌డికి వెళ్లినా 'నో క్యాష్ బోర్డు'లే క‌నిపిస్తుండ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకుంటున్నారు. నోట్ల ర‌ద్దుపై మొద‌ట్లో హ‌ర్షం వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు ఇప్పుడు ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు త‌గినంత క‌రెన్సీని అందుబాటులోకి తీసుకురావ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందని అంటున్నారు. మొద‌ట్లో రూ.4వేలు మార్చుకోవ‌చ్చ‌ని, బ్యాంకులో నేరుగా రూ.10వేలు, వారానికి రూ.20 వేలు డ్రా చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ప్ర‌జ‌ల ఇబ్బందుల కార‌ణంగా ప‌రిమితిని స‌వ‌రించింది. న‌గ‌దు మార్పిడిని రూ.2 వేల‌కు త‌గ్గించి త‌మ ఖాతాలోని సొమ్మును ఒకేసారి రూ.24 వేలు తీసుకోవ‌చ్చంటూ పేర్కొంది. అయితే న‌గ‌దు కొర‌త కార‌ణంగా అంత డ‌బ్బు ఇవ్వ‌లేమంటూ బ్యాంకులు చేతులు ఎత్తేస్తున్నాయి. న‌గ‌దు కొర‌త ఉందంటూ రూ.5-10 వేలు చేతుల్లో పెట్టి పంపించేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే మ‌ధ్యాహ్నం త‌ర్వాత న‌గ‌దు మార్ప‌డిని నిలిపివేస్తుండ‌డంతో ప్ర‌జ‌ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. బ్యాంకులు డ‌బ్బులు ఇవ్వ‌క‌, ఏటీఎంలు తెరుచుకోక ప్ర‌జ‌లు అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. దీంతో వారిలో ఆగ్రహావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

More Telugu News