: బకింగ్ హామ్ ప్యాలెస్ ను తాత్కాలికంగా వదిలివేయనున్న క్వీన్ ఎలిజబెత్ II

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II (90) ప్రఖ్యాత కట్టడం బకింగ్‌ హ్యామ్ ప్యాలెస్ ను విడిచిపెట్టనున్నారా? అంటే అవుననే రాజప్రాసాదం సమాధానం చెబుతోంది. ప్రపంచ చారిత్రక కట్టడాల్లో బకింగ్‌ హ్యామ్ ప్యాలెస్ కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక కట్టడంలో మొత్తం 775 గదులుండగా, అందులో 19 స్టేట్ రూములు, 52 రాయల్, గెస్ట్ బెడ్ రూములు, 188 స్టాఫ్ బెడ్ రూములు, 92 ఆఫీసులు, 78 స్నానాల గదులు ఉన్నాయి. పూర్తిగా పాతబడిన ఈ కట్టడం జీవితకాలాన్ని మరో 50 ఏళ్లపాటు అంటే 2067 వరకు పొడిగించాలనే ఉద్దేశంతో దానిని ఆధునికీకరించనున్నారు. అందులో భాగంగానే క్వీన్ ఎలిజబెత్ II వేరే బిల్డింగ్ కు తన నివాసాన్ని మార్చనున్నారు. బకింగ్ హామ్ ప్యాలెస్ ను మూడువేల కోట్ల రూపాయల (369 మిలియన్ పౌండ్లు) తో ఆధునికీకరించనున్నామని బ్రిటన్ ట్రెజరీ ప్రకటించింది. ప్యాలస్ ఆధునికీకరణ పూర్తయ్యే వరకు క్వీన్ ఎలిజబెత్ II వేరే బిల్డింగ్ లో వుంటారు. ఆమె కోసం ఒక ప్రత్యేకభవనాన్ని రాజకుటుంబం నిర్మిస్తోంది. దీని నిర్మాణం ఏప్రిల్, 2017లో పూర్తికానుందని మాస్టర్ ఆఫ్ ది క్వీన్స్ హౌస్‌ హోల్డ్ టోనీ జాన్‌ స్టోన్-బర్ట్ తెలిపారు.

More Telugu News