: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాది కొత్త భాష్యం చెప్పారు: బొత్స సత్యనారాయణ

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈ రోజు మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసులో హైకోర్టులో వాద‌న‌లు జ‌రుగుతున్న స‌మయంలో చంద్రబాబు తరఫున వాదిస్తున్న‌ న్యాయవాది ఓ కొత్త భాష్యం చెప్పారని అన్నారు. డబ్బు పుచ్చుకుంటే అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాద‌న్న‌ట్లు ఆయ‌న‌ హైకోర్టులో వాదించార‌ని చెప్పారు. ఓటుకు నోటు కేసు విష‌యంలో రేవంత్‌ రెడ్డి టీఆర్ఎస్‌ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇచ్చిన డబ్బు త‌న‌ది కాదని చంద్ర‌బాబు ఇంత‌వ‌ర‌కూ ఎందుకు చెప్ప‌డం లేద‌ని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు తాను నిప్పు అని చెప్పుకుంటార‌ని, మ‌రి ఇటువంటి చ‌ర్య‌ల‌ను ప్రోత్సహిస్తారా? అని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు త‌నకు రూ.50 లక్షల ఆస్తి మాత్ర‌మే ఉంద‌ని వ్యాఖ్య‌లు చేస్తుంటార‌ని, మరి ఆయ‌న త‌ర‌ఫున వాదిస్తోన్న న్యాయ‌వాదికి రోజుకు రూ.10 లక్షలు ఎలా ఇస్తున్నార‌ని బొత్స అడిగారు.

More Telugu News