: 'ఇప్పుడు చనిపోతున్నా... వందేళ్ల తరువాత బతికొస్తానేమో' అనగానే కోర్టు కూడా ఓకే చెప్పింది!

భవిష్యత్ వైద్య పరిజ్ఞానం ఏ విధమైన సౌలభ్యాలను మానవాళికి అందిస్తుందో చెప్పడం కష్టమేగానీ, అందివచ్చే వైద్యావకాశాలపై ఉన్న నమ్మకం, ఓ బాలిక కోరికను న్యాయమూర్తులు మన్నించేలా చేసింది. క్యాన్సర్ తో మరణించిన 14 సంవత్సరాల లండన్ బాలిక కోరిక మేరకు, ఆమె మృతదేహాన్ని అతిశీతలీకరణ పద్ధతిలో దాచేందుకు అనుమతించింది. మరణించే ముందు ఆ బాలిక కోర్టుకు లేఖ రాస్తూ, "నాకు కేవలం 14 సంవత్సరాలు. నేను మరణించాలని అనుకోవడం లేదు. కానీ తప్పట్లేదు. భవిష్యత్తులో నన్ను బతికించే ఔషధాలు తయారు కావచ్చు. అందువల్ల నా మృతదేహాన్ని భద్రపరచాలని కోరుకుంటున్నా. వైద్య రంగంలో ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. నేను కూడా ఓ వందేళ్ల తరువాత బతికొస్తానేమో" అంటూ సదరు లేఖలో రాసింది. తన కుమార్తె కోరికను తీర్చాలన్న ఆమె తల్లి పోరాటం కోర్టు మెట్లెక్కగా, న్యాయమూర్తి పీటర్ జాక్సన్ బాలిక కోరికకు అనుకూలంగా తీర్పిచ్చారు. చివరి హియరింగ్ కు ఆమె రాలేకపోయినప్పటికీ, ఆమె మృతదేహాన్ని అమెరికాకు తరలించి, 'క్రయోజనికల్లీ ఫ్రోజన్' విధానంలో భద్రపరచాలని వెల్లడించడం గమనార్హం. ఒకవేళ, ఓ వంద లేదా రెండు వందల సంవత్సరాల తరువాత, బాలిక కోరిక తీరి ఆమె బతికినా, అప్పటికి ఆమెకు ఎవరూ చుట్టాలుండరని, బహుశా ఆమెకు ఏదీ గుర్తుండక పోవచ్చని విచారణకు హాజరైన వైద్య నిపుణులు చెప్పారట.

More Telugu News