: చైనా మాస్టర్ ప్లాన్ లో భాగం... ఇండియాకు లబ్ధి కోసమే ఎకనామిక్ కారిడార్: పాక్ ఎంపీల భయాందోళన

చైనా నుంచి పాకిస్థాన్ మీదుగా నిర్మితమైన ఎకనామిక్ కారిడార్ వల్ల తమ దేశం కన్నా ఇండియాకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని పాక్ ఎంపీలు భయపడుతున్నారు. చైనా ఓ పథకం ప్రకారం ఎకనామిక్ కారిడార్ ను భారత్ తో వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు వాడుకుంటుందని, పాక్ తో పోలిస్తే భారత్ తో చైనా వాణిజ్యం ఎన్నో రెట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రజా ప్రతినిధులు అంటున్నారు. దాదాపు 46 బిలియన్ డాలర్లతో 2,442 కిలోమీటర్ల పొడవున చైనా సరిహద్దుల నుంచి పాకిస్థాన్ లోని గ్వదార్ నౌకాశ్రయం వరకూ ఈ కారిడార్ నిర్మితమైన సంగతి తెలిసిందే. ఇక పాక్ నేషనల్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన వేళ, సీపీఈసీ ప్రాజెక్టులో చైనా భారీ పెట్టుబడుల వెనుక భవిష్యత్ వ్యూహాలు ఉన్నాయని పలువురు ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించారని 'డాన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొత్త భూభాగాలతో వాణిజ్యం కోసం పాక్ ను చైనా పావుగా వాడుకుంటోందని, ఇండియాతో పాటు మధ్య ఆసియా దేశాలతో, యూరప్ తో రహదారి వ్యవస్థ కోసం చైనా ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రణాళిక, అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సయ్యద్ తాహిర్ హుస్సేన్ మష్హదీ వ్యాఖ్యానించారు. సీపీఈసీ ప్రాజెక్టును భారత్ తో బలమైన వాణిజ్య బంధం కోసం చైనా తప్పనిసరిగా వాడుకుంటుందని, ఇది పాక్ భద్రతకు ప్రయోజనాలకు విఘాతమని ఆయన అన్నారు.

More Telugu News