: స్ట్రెచ‌ర్ ఇచ్చేందుకు నిరాక‌రించిన ఆస్ప‌త్రి సిబ్బంది.. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫ‌స్ట్‌ఫ్లోర్‌కు భ‌ర్త‌ను ఈడ్చుకెళ్లిన భార్య‌

ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల్సిన ప్ర‌భుత్వాస్ప‌త్రులు చేతులెత్తేస్తున్నాయి. ఆస్ప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వాలు దృష్టి సారించ‌క‌పోవ‌డం, ఆస్ప‌త్రుల నిర్ల‌క్ష్యం వెర‌సి స‌గటు జీవి ఉసురు తీస్తున్నాయి. దిష్టిబొమ్మ‌ల్లా మిగిలిపోతున్న ప్ర‌భుత్వాస్ప‌త్రుల్లో జ‌రుగుతున్న ఘోరాలు రోజుకొక‌టి చొప్పున వెలుగు చూస్తున్నా ప్ర‌భుత్వాలు స్పందించ‌డం లేద‌న‌డానికి తాజా ఘ‌ట‌న చిన్న ఉదాహ‌ర‌ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంత‌క‌ల్‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న అక్క‌డున్న వారితో క‌న్నీరు పెట్టించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. శ్రీనివాసాచారి(45), శ్రీవాణి(40) భార్యాభ‌ర్త‌లు. కొన్ని రోజుల క్రితం శ్రీ‌నివాసాచారికి గుండెపోటు వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌క్ష‌వాతానికి గుర‌య్యాడు. న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న భ‌ర్త‌ను శ్రీవాణి బుధ‌వారం గుంత‌క‌ల్‌లోని ప్ర‌భుత్వాస్ప‌త్రికి తీసుకొచ్చింది. మొద‌టి అంత‌స్తులో ఉన్న క‌న్సెల్టెన్సీకి తీసుకెళ్లేందుకు సిబ్బందిని స్ట్రెచ‌ర్ అడిగింది. ఆమెకు స్ట్రెచ‌ర్ ఇచ్చేందుకు ఆస్ప‌త్రి సిబ్బంది నిరాకరించారు. భ‌ర్త‌ను మొద‌టి అంత‌స్తుకు తీసుకెళ్లి వైద్యుల‌కు చూపించేందుకు శ్రీవాణికి మ‌రో మార్గం క‌నిపించ‌లేదు. దీంతో కింది నుంచి మొద‌టి అంత‌స్తుకు భ‌ర్త‌ను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డున్న రోగులు, ఆస్ప‌త్రి సిబ్బంది క‌న్నార్ప‌కుండా చూశారే త‌ప్పితే, సాయం చేసేందుకు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. 'స్ట్రెచ‌ర్ ఇవ్వండి.. నేను తోసుకుంటూ వెళ్తా'.. అన్నా సిబ్బంది క‌నిక‌రించ‌లేద‌ని శ్రీవాణి కన్నీరు పెట్టుకుంది. స్ట్రెచ‌ర్ ఇస్తారేమోన‌ని గంట‌పాటు వేచి చూసిన త‌ర్వాత చివ‌రికి భ‌ర్త‌ను ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ఈ విష‌యం త‌న దృష్టికి వ‌చ్చింద‌ని, బాధ్యుల‌పై స‌త్వ‌రం చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆస్ప‌త్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్ట‌ర్ మ‌ల్లికార్జున్ తెలిపారు. విష‌యం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే జితేంద‌ర్ గౌడ్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు.

More Telugu News