: అధిక డిపాజిట్లు, ఆస్తుల కొనుగోలుపై ఐటీ నోటీసులు మొదలు... తప్పించుకునే దారేది?

ప్రతి రోజూ సాయంత్రం 6 దాటగానే, తమ వద్ద ఉన్న ఏ సేవింగ్స్ ఖాతాలో రూ. 2.5 లక్షలకు మించిన డబ్బు జమ అయిందన్న విషయాన్ని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు ఐటీ అధికారులకు తెలియజేయాలి. అధిక విలువ వున్న పాత నోట్లను బ్యాంకులకు జమ చేసేందుకు డిసెంబర్ నెలాఖరు వరకూ సమయం ఉండగా, గత వారం రోజుల్లో బ్యాంకులకు వచ్చిన భారీ మొత్తాలపై ఇప్పటికే ఐటీ అధికారులు దృష్టిని సారించారు. అనుమానాస్పద డిపాజిట్లు, ఆస్తుల కొనుగోళ్లపై నోటీసులు పంపడం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక కరెంటు ఖాతాలను కలిగివున్న వారిలో రూ. 12.5 లక్షలు మించి వున్నా కూడా వాటిపై దృష్టిని సారించింది. ఇప్పటికే రూ. 50 వేలు పైబడిన డిపాజిట్లపై పాన్ కార్డును తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు ఏభై వేల మొత్తానికి కాస్త తక్కువగా డిపాజిట్ చేసుకుంటూ వెళుతున్నారు. దీనిని గమనించిన అధికారులు నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్యలో ఆయా అకౌంట్లలో మొత్తం డిపాజిట్ రూ. 2.5 లక్షలు దాటిన పక్షంలో పాన్ కార్డు సంఖ్యను బ్యాంకులు కచ్చితంగా తీసుకోవాల్సిందేనని ఐటీ అధికారుల నుంచి బ్యాంకులకు ఆదేశాలు అందాయి. ఇక అధిక మొత్తంలో డిపాజిట్లు వేసిన వారికి, పెద్ద నోట్ల రద్దు తరువాత ఆస్తులను కొనుగోలు చేస్తున్న వారికీ నోటీసులు అందుతుండటంతో, అక్రమార్కులు తప్పించుకునే దారి తెలియక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది.

More Telugu News