: భారతీయ సంతతి మహిళకు అమెరికా కేబినెట్ లో అత్యంత కీలక పదవి?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్ ను రూపొందించే పనిలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ కు కేబినెట్ లో ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో, మరో భారత సంతతి మహిళ నిక్కే హేలీకి అత్యున్నత విదేశాంగ శాఖ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. 44 ఏళ్ల నిక్కే హేలీ ప్రస్తుతం దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండో పర్యాయం గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు ఒకరు వెల్లడించారు. ఈ రోజు ట్రంప్ తో హేలీ భేటీ అవుతారని అధ్యక్ష అధికార బదలాయింపు బృందం ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. బాబీ జిందాల్, నిక్కే హేలీలకు కేబినెట్ లో స్థానం దక్కితే... ఆ పదవులు పొందిన తొలి భారతీయ అమెరికన్లుగా వారు చరిత్రకెక్కుతారు.

More Telugu News