: కుషాయిగూడ‌లో విషాదం.. క్యూక‌ట్టిన క‌ష్టాలు.. పెళ్లి జరగాల్సిన ఇంట్లో తండ్రి మృతి.. అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చేస‌రికి ఇంట్లో చోరీ!

క‌ష్టాల‌కు కూడా క‌న్నీళ్లు తెప్పించే ఘ‌ట‌న ఇది. కష్టాలు ఇలా కూడా ఉంటాయా అనిపించే విషాద‌మిది. శుభ‌కార్యం జ‌ర‌గాల్సిన ఇంట్లో చోటుచేసుకున్న వ‌రుస ఘ‌ట‌న‌లు చూసిన వారి హృద‌యాన్ని ద్ర‌వింపజేస్తున్నాయి. హైద‌రాబాద్ కుషాయిగూడ‌లో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి డీఐ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. స్థానిక బ‌స్ స్టాప్ స‌మీపంలో నివ‌సించే సింగిరెడ్డి ల‌క్ష్మారెడ్డి కుమార్తె వివాహం నిశ్చ‌యమైంది. పెళ్లి కుమారుడి త‌ర‌పు బంధువులు బుధ‌వారం భోజ‌నానికి వ‌స్తున్న‌ట్టు క‌బురు చేశారు. ఈ స‌మ‌యంలో వ‌ర‌పూజ నిర్వ‌హించి వ‌రుడికి క‌ట్నం కింద కొంత డ‌బ్బు ఇవ్వాల‌ని ల‌క్ష్మారెడ్డి భావించారు. అందుకోసం డ‌బ్బులు తెచ్చి ఇంట్లో భ‌ద్ర‌పరిచారు. అయితే ఆ శుభ‌కార్యం చూడ‌కుండానే మంగ‌ళ‌వారం రాత్రి ల‌క్ష్మారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడిన పెళ్లి ఇల్లు ఒక్క‌సారిగా క‌ళ త‌ప్పింది. బుధ‌వారం ల‌క్ష్మారెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటు చేశారు. ఇంటికి తాళం వేసి అంద‌రూ క‌లిసి అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లారు. దీన్ని అదునుగా భావించిన దొంగ‌లు ఇనుప‌రాడ్డుతో తాళం పగ‌ల‌గొట్టి లోనికి ప్ర‌వేశించారు. బీరువాను ప‌గ‌ల‌గొట్టి అందులో ఉన్న రూ.11.70 ల‌క్ష‌ల న‌గ‌దు, 15 తులాల బంగారు న‌గ‌ల‌ను దోచుకెళ్లారు. ద‌హ‌న సంస్కారాల అనంత‌రం ఇంటికొచ్చిన కుటుంబ స‌భ్యులు త‌లుపు తాళం ప‌గ‌ల‌గొట్టి ఉండ‌డాన్ని చూసి వెంట‌నే లోప‌లికి వెళ్లి చూశారు. బీరువాలోని న‌గ‌దుతోపాటు బంగారు ఆభ‌ర‌ణాలు చోరీకి గురి కావ‌డంతో ల‌బోదిబోమ‌న్నారు. పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో వారొచ్చి ఆధారాలు సేక‌రించారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News