: సచిన్ కోసం సజ్జ వడలు చేశా... వేరుశనక్కాయలు ఉడకబెడతా... ఓ కోరిక కోరుతా: దత్తత గ్రామ మహిళ

నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగకు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామం సచిన్ ను ఘనంగా సత్కరించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సచిన్ రాక గురించి ఓ మహిళ మాట్లాడుతూ, ఆయన తమకు దేవుడితో సమానమని చెప్పింది. ముళ్ల పొదలతో నిండిన తమ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారని తెలిపింది. తన కుమారుడు మహేష్‌ వివాహం ఆయన చేతుల మీదుగా చేయాలని అనుకున్నా కానీ, ఆయన వస్తారో, రారో అన్న అపనమ్మకంతో ముహూర్తం మార్చామని చెప్పింది. ఏడాది తరువాత వస్తానని సచిన్ చెప్పినా, గ్రామంలో వాళ్లు ఆయన రాకను ఖరారు చేయకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. గతేడాది సచిన్ వచ్చినప్పుడు తాను మాట్లాడుతుంటే తెలుగు రాదని సచిన్ చెప్పారని, అధికారులు తన మాటలు తర్జుమా చేశారని గుర్తుచేసుకుంది. అప్పుడు సచిన్ కు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయానని, ఇప్పుడు మాత్రం అలా కాదని, పూల గుత్తితో స్వాగతం పలుకుతానని ఆమె తెలిపింది. శాలువతో సత్కరిస్తానని చెప్పింది. సచిన్ కోసం ఇప్పటికే సజ్జ వడలు చేశానని, వేరుశనక్కాయలు ఉడకపెట్టి ఇస్తానని, కొబ్బరినీళ్లు కూడా ఆయనకు ఇస్తానని ఆమె అంది. ఆయన కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పిన ఆమె, గ్రామ ప్రజల జీవన శైలి మాత్రం మెరుగుపడలేదని తెలిపింది. ఆ దిశగా ఏదైనా చేయాలని కోరుతానని ఆమె తెలిపింది. అలాగే సచిన్ కు తమ గ్రామాన్ని సూచించిన అప్పటి జాయింట్ కలెక్టర్ రేఖావాణిని కూడా ఒకసారి కలవాలని ఉందని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఇలాంటి భావాలే గ్రామంలోని అంతా వ్యక్తం చేయడం విశేషం.

More Telugu News