: కొత్త రూ.2 వేల నోటు తడిస్తే కలర్ పోవచ్చు.. కంగారుపడకండి!

పెద్దనోట్ల రద్దు అనంతరం అందుబాటులోకి వచ్చిన కొత్త రూ.2 వేల నోటు ప్రత్యేకతలు, ముఖ్యమైన విషయాల గురించి ఇప్పటికే తెలుసుకున్నాం. తాజాగా, ఈ నోటుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే... పింక్ కలర్ లో ఉన్న కొత్త రెండు వేల రూపాయల నోటును తడిగుడ్డతో తుడిచినా లేకపోతే నీళ్లతో కడిగినా దాని కలర్ కొంచెం పోతుందట. తడిగుడ్డతో తుడిచిన తర్వాత లేదా నీళ్లతో కడిగిన తర్వాత ఆ విధంగా జరిగితేనే అది అసలు నోటని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ ఈరోజు పేర్కొన్నారు. ఒకవేళ, రూ.2 వేల నోటు రంగు ఏమాత్రం పోకుండా, అదేమాదిరి ఉంటే కనుక అది నకిలీ నోటు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ తరహా రంగులో రెండు వేల నోటును తయారు చేశామని, అందుకే, తడిగుడ్డతో తుడిచినా, నీళ్లతో కడిగినా నోటు రంగులో స్వల్పమైన మార్పు వస్తుందన్నారు. కాగా, ఇందుకు సంబంధించి మూడు వీడియోలు సామాజిక మాధ్యమం ‘యూట్యూబ్’ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ నోటును తడిగుడ్డతో తుడిచినప్పుడు లేదా నీళ్లతో కడిగినప్పుడు కానీ, మెరిసిపోతూ ఉండే రెండు వేల నోటు కొంచెం మెరుపుతగ్గినా భయపడాల్సిన అవసరం లేదని శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు.

More Telugu News