: నిజమా? పుకారా?... ఆ 'బిచ్చగాడు' తెచ్చిన మొత్తాన్ని చూసి నోరెళ్లబెట్టిన బ్యాంకు సిబ్బంది!

'తెలంగాణలోని వికారాబాద్ లో జరిగిన సంఘటన..' అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోది. దాని వివరాల్లోకి వెళ్తే... 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో చాలా మంది పనులు మానుకుని బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూకడుతున్నారు. ఈ నేపథ్యంలో వికారాబాద్ లోని ఓ బ్యాంకు ముందు కూడా చాలా మంది క్యూకట్టారు. ఇంతలో ఓ బిచ్చగాడు సంచితో వచ్చి క్యూలైన్ లో నిలబడ్డాడు. అతని వేషధారణ చూసిన చాలా మంది అతనిని చీదరించుకున్నట్టు చూశారు. అలాంటి చూపులకు అలవాటైపోయిన ఆ వ్యక్తి మాత్రం అవేవీ పట్టనట్టు తన వంతు వచ్చేంతవరకు క్యూలైన్ లో నిల్చున్నాడు. అప్పటికి క్యూ మరింత పెరిగిపోయింది. ఇంతలో అతనిని బ్యాంకు ఉద్యోగి ఎంత జమచేస్తున్నావంటూ ప్రశ్నించాడు. అంతే.. అక్కడున్న వారికి దిమ్మతిరిగేలా తన బ్యాగులోంచి 50,00,000 రూపాయలు తీసి బయటపెట్టాడు. ఇంత మొత్తం జమ చేయాలంటే పాన్ కార్డు కావాలని వారు సూచించడంతో నెమ్మదిగా జేబులోంచి పాన్ కార్డు తీసి వారికి అందించాడు. దీంతో వారికి మతిపోయింది. అయినా నమ్మకం కుదరని బ్యాంకు సిబ్బంది, ఇంత డబ్బు ఎక్కడిది? అని నిలదీశారు. రెండు నెలల క్రితం తన రెండెకరాల పొలం అమ్మగా వచ్చిన డబ్బని అతను సమాధానం ఇచ్చాడు. దీంతో ఆధారాలు చూపించాలని వారు అతనిని కోరడంతో తీసుకొస్తానంటూ అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బ్యాంకు అధికారులే కాకుండా, క్యూలైన్లో నిల్చున్న వారు కూడా కాసేపు షాక్ కు గురయ్యారు. అయితే ఇది నిజమా? లేక ఎవరైనా చేస్తున్న పుకారా? అన్నది మాత్రం తెలియాల్సి వుంది.

More Telugu News