: అసభ్యంగా ప్రవర్తించిన అతనిని ఇక మా విమానాలు ఎక్కనివ్వం: బ్రిటిష్ ఎయిర్ లైన్స్

బ్రిటన్‌ కు చెందిన బ్రాడ్డన్ అసోసియేట్స్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్‌ వాన్‌ (61) చేసిన పనితో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. వివరాల్లోకి వెళ్తే... వాన్ గత అక్టోబర్‌ లో బ్రిటిష్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో బిజినెస్ క్లాస్ లో సౌతాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ వెళ్లాడు. ఆ విమానంలో 26 ఏళ్ల మహిళా స్టీవార్డ్.. వాన్ పక్కసీట్లో కూర్చున్న వేరొకరికి ఆహారం వడ్డించేందుకు ముందుకు వంగింది. ఈ సమయంలో వాన్ తన ఫోన్ లోని వీడియో రికార్డింగ్ మోడ్ ఆన్ చేసి, ఆమెను అభ్యంతరకర భంగిమలో వీడియో తీశాడు. దీనిని గమనించిన ఆ ఉద్యోగిని అతనిని అక్కడే నిలదీసింది. నేరుగా వెళ్లి ఫ్లైట్‌ కెప్టెన్‌ కు ఫిర్యాదు చేసింది. దీంతో కెప్టెన్‌ కంట్రోల్ రూంకి సమాచారం ఇచ్చాడు. విమానం కేప్‌ టౌన్‌ లో ల్యాండ్‌ అయిన వెంటనే పోలీసులు వాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికే విడుదలయ్యాడు. దీనిపై విమానయాన సంస్థ ఆరా తీయగా, అతనిపై పెట్టీ కేసు పెట్టి, కేవలం 13 యూరోలు జరిమానా విధించి వదిలేశారు. దీనిపై మండిపడ్డ బ్రిటిష్‌ ఎయిర్‌ లైన్స్ సంస్థ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మళ్లీ మరోసారి అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సారి అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసు సెలవుపై వెళ్లాడు. దీంతో ఈ కేసులో వాన్ లంచం ఇచ్చి పోలీసులను మేనేజ్ చేస్తున్నాడని భావించిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోపక్క, అటెండెంట్ ను అసభ్యంగా చిత్రీకరించి, దాని నుంచి ధనబలంతో తప్పించుకుంటున్న నేరానికి భవిష్యత్ లో ఎప్పుడూ తమ విమానాల్లో మార్టిన్‌ ను ప్రయాణించనివ్వబోమని బ్రిటిష్‌ ఎయిర్‌ లైన్స్‌ ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించిన అతడికి శిక్షపడాల్సిందేనని, ఈ మేరకు సౌతాఫ్రికా పోలీసులకు సహకరిస్తామని తెలిపింది.

More Telugu News