: ముద్ర‌గ‌డ పాదయాత్ర‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

కాపుల‌కు ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్‌లను డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఉద్య‌మంలో భాగంగా మాజీమంత్రి, కాపు ఐక్య‌వేదిక నేత‌ ముద్రగడ పద్మనాభం రేపటి నుంచి ప్రారంభించ‌నున్న పాద‌యాత్ర‌కు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. ఆయ‌న పాద‌యాత్ర‌కు వ్య‌తిరేకంగా హైకోర్టులో దాఖ‌లు చేసిన‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు మ‌ధ్యాహ్నం మ‌రోసారి విచారించిన హైకోర్టు ముద్ర‌గ‌డ పాద‌యాత్ర నేప‌థ్యంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లుగుతుందంటూ ప్ర‌భుత్వం కార‌ణం చెప్ప‌డం స‌రికాద‌ని పేర్కొంది. శాంతియుత ప‌ద్ధ‌తిలో నిర‌స‌న తెలుపుకోవ‌చ్చ‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను పోలీసులే చూసుకోవాల‌ని చెప్పింది. ముద్ర‌గ‌డ ఇటీవ‌లే తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంత‌ర్వేది వ‌ర‌కు ఐదు రోజులు పాద‌యాత్ర చేస్తాన‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కాపునేత‌లు ఆయా ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు.

More Telugu News