: డిసెంబరు 30 వరకు ఏటీఎం చార్జీలు రద్దు.. రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం

నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంల ద్వారా జరిపే లావాదేవీలపై డిసెంబరు 30 వరకు ఎటువంటి చార్జీలను వసూలు చేసేది లేదని ప్రకటించింది. అయితే ఇది సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుందని, డెబిట్ కార్డులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. తమ బ్యాంకులతోపాటు ఇతర బ్యాంకుల్లో నెలలో ఎన్నిసార్లు అయినా లావాదేవీలు చేసుకోవచ్చని, పరిమితి లేదని, చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. ప్రస్తుతం సొంతబ్యాంకు ఏటీఎం నుంచి నెలకు ఐదుసార్లు, ఆరు మెట్రో నగరాల్లో ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంది. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి నెలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం పెద్ద నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు పొందడానికి పరిమితులు విధించడంతో డెబిట్ కార్డును పలుమార్లు ఉపయోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రిజర్వ్ బ్యాంకు డెబిట్ కార్డు వినియోగంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

More Telugu News