: పెద్ద నోట్లు మార్చుకోవాలా? రండి బాబు.. రండి!.. గుంటూరు బ్యాంకుల్లో జోరుగా ‘చిల్లర’ దందా

‘రండి బాబు రండి.. ఆలసించిన ఆశాభంగం. మీ వద్ద ఉన్న పెద్దనోట్లు వెంటనే చిల్లరగా మార్చేసుకోండి. నిశ్చింతంగా ఉండండి..’ గుంటూరులో ఇప్పుడు వినిపిస్తున్నది ఇదే. పెద్ద నోట్ల రద్దుతో రంగంలోకి దిగిన దళారులు జాతీయ, ప్రైవేటు, సహకార, అర్బన్ బ్యాంకులతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని చిల్లర దందాకు తెరలేపారు. ఈ దందా కోసం దళారులు ఏకంగా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. కరెన్సీ చెస్ట్‌ల వద్ద కమీషన్ ఆధారంగా నోట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా, గుట్టుగా సాగుతోంది. 20 శాతం కమిషన్‌పై దళారులు ఎంత సొమ్మునైనా చిటికెలో మార్చి ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్‌పై కొత్త నోట్లు ఇచ్చేసిన తర్వాత అధికారులు అందుకు అనుగుణంగా రికార్డులు తయారుచేస్తున్నారని గుంటూరువాసులు ఆరోపిస్తున్నారు. నగరంలోని లాలాపేటలో ఓ ప్రైవేటు బ్యాంకులో అచ్చంగా ఇదే వ్యాపారం జోరుగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అమరావతి ప్రాంతంలోని ఓ విత్తన వ్యాపారి ఈ కమిషన్ పద్ధతిని ఉపయోగించుకుని కోటి రూపాయలు మార్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోట్ల మార్పిడి కోసం సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే ఇలా దొడ్డిదారిన నోట్ల మార్పిడి దందా ఏంటంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు బ్యాంకులపై నిఘా వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News