: డిసెంబర్ 17న బాక్సర్‌ విజేందర్ కు కఠిన పోరు

ప్రొఫెషనల్ బాక్సింగ్ రింగ్ లోకి ఎంటరైన భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో డబ్ల్యూబీవో సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ ఆసియా పసిఫిక్‌ టైటిల్‌ ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిదో బౌట్ లో కఠిన పరీక్షను ఎదుర్కొనబోతున్నాడు. తన ప్రొఫెషనల్‌ బాక్సింగ్ కెరీర్‌ లోనే బలమైన ప్రత్యర్థిని డిసెంబర్ 17న ఢిల్లీ వేదికగా ఎదుర్కోబోతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ ప్రపంచ మాజీ ఛాంపియన్‌, ప్రస్తుత ఖండాంతర ఛాంపియన్‌ అయిన టాంజానియా బాక్సర్‌ ఫ్రాన్సిస్‌ చెకాతో విజేందర్ సింగ్ తలపడబోతున్నాడు. 34 ఏళ్ల సీనియర్‌ టాంజానియా బాక్సర్‌ అయిన చెకా, ఇప్పటివరకు తలపడిన 43 బౌట్లలో 32 విజయాలు సాధించాడు. ఇందులో 17 నాకౌట్లు ఉండటం విశేషం. విజేందర్‌ సింగ్ కూడా తేలికైన ప్రత్యర్థి కాదన్న విషయం అతని గత మ్యాచ్ లు చూసేవారెవరికైనా తెలుస్తుంది. ఇప్పటివరకు విజేందర్ ఏడింట్లో తలపడి గెలుపొందగా, ఆరు నాకౌట్ విజయాలు సాధించాడు. దీంతో వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగుతుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ పోరుపై విజేందర్ సింగ్ మాట్లాడుతూ, చెకా అనుభవజ్ఞుడైన బాక్సర్‌ అనీ, ఎన్నో బౌట్లలో విజయాలు సాధించాడన్నాడు. అయితే, ఇవేవీ తననను భయపెట్టవని, వెనకడుగు వేసేలా చేయవని స్పష్టం చేశాడు. అతని స్థాయికి చేరేందుకు చాలా కఠిన శిక్షణను పొందుతున్నానని విజేందర్ సింగ్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో తప్పకుండా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతంలో మాదిరిగా అభిమానుల నుంచి భారీ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు. ఇదే సమయంలో చెకా మాత్రం విజేందర్‌ గత ప్రత్యర్థుల్లానే అతనిని మట్టికరిపిస్తానని పేర్కొన్నాడు. నాకౌట్ కు రెడీగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నాడు.

More Telugu News