: బిగిసిన ఉచ్చు.. పాక్‌ ప్రధాని షరీఫ్ కి వ్యతిరేకంగా సుప్రీంకు ఆధారాలు సమర్పించిన ఇమ్రాన్ ఖాన్!

పనామా పత్రాలు విడుద‌ల చేసిన అక్ర‌మాస్తుల చిట్టాలో పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్ పేరు ఉండ‌డంతో ఆయ‌న‌కు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్ పై స్పందించి, విచార‌ణ జ‌రిపించాల్సిందిగా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న ఇప్పుడు తీవ్ర క‌ష్టాల్లో ప‌డుతున్నారు. న‌వాజ్ ష‌రీఫ్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత ఇమ్రాన్‌ ఖాన్ న్యాయ‌స్థానానికి ఆధారాలు ఇవ్వ‌డంతో ష‌రీఫ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయ‌న న్యాయ‌స్థానానికి అందించిన ఆధారాల్లో ష‌రీఫ్ అక్ర‌మాల చిట్టాను బ‌య‌ట‌పెట్టారు. 1988 నుంచి షరీఫ్‌ కుటుంబం అక్రమ వ్యాపారాలు చేస్తోంద‌ని, ట్యాక్స్ క‌ట్ట‌కుండా రూ. 14.5 కోట్ల న‌గ‌దుని మనీలాండరింగ్ చేశార‌ని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్‌ వివరాలు, రుణాలను ఎగ్గొట్టిన వివరాల ఆధారాల‌ను ఇమ్రాన్ ఖాన్ అందించారు. గ‌తంలో పాకిస్థాన్ పత్రిక డాన్ ఈ అంశంపై క‌థ‌నాన్ని వెల్ల‌డిస్తూ ష‌రీఫ్ కుటుంబం విదేశాలకు రూ.145 మిలియన్ల న‌గ‌దును పంపించింద‌ని పేర్కొంది. ప‌న్ను విష‌యానికొస్తే రూ.897 పన్నును మాత్రమే చెల్లించిందని చెప్పింది. ఈ ఆధారాల‌నే ఇమ్రాన్‌ఖాన్ న్యాయ‌స్థానం ముందు ఉంచారు.

More Telugu News