: అడగకుండానే అప్పులు, ఏడాది జీతం అడ్వాన్స్... అక్రమార్కులు చాలా 'స్మార్ట్'!

నల్లకుబేరులు చాలా స్మార్ట్ అయిపోయారు. తమ వద్ద ఉన్న నల్లధనాన్ని ఎలాగోలా తెల్లధనంగా చేసుకునేందుకు వడ్డీ లేకుండా అప్పులివ్వడం, తమ వద్ద పనిచేసేవారికి ఏడాది వేతనం ముందుగానే ఇవ్వడం వంటి పనులు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో ఈ తరహా దృశ్యాలు ఇప్పుడు అధికంగా కనిపిస్తున్నాయి. పలువురు చోటా మోటా రాజకీయ నాయకులు దీర్ఘకాలంగా తమ వద్ద అనుచరులుగా పనిచేస్తున్న వారి నుంచి నోటు రాయించుకుని రూ. 2 లక్షలు అప్పిస్తున్నారు. వారు తిరిగి సదరు నేత అడిగినప్పుడు వడ్డీ లేకుండా తీసుకున్న రెండు లక్షలు చెల్లిస్తే చాలు. విజయవాడకు చెందిన ఓ నేత ఇలాగే దాదాపు 40 నుంచి 50 మందికి డబ్బిచ్చినట్టు తెలుస్తోంది. ఇక పలు కళాశాలలు, చక్కెర మిల్లులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న మరో నేత, తన వద్ద పనిచేస్తున్న అందరికీ ఏడాదికి సరిపడా జీతాలు ఇచ్చి, వారిపట్ల దయ, జాలి, కనికరం చూపారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు, గత మంగళవారం మోదీ ప్రకటనతో మూడు నాలుగు రోజుల పాటు నిద్రపోని అక్రమార్కులు తమ ఆలోచనలకు పదునుపెట్టి, వారి వద్ద ఉన్న బ్లాక్ మనీలో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని వైట్ గా చేసుకునేందుకు కదులుతున్నారు. ఇదిలావుండగా, కోనసీమ ప్రాంతంలో రెండున్నర వేల మంది బ్యాంకు ఖాతాల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకూ బ్యాంకుల్లో జమ అయ్యాయి. ఇక ఈ పెద్ద నోట్ల రద్దు ముఠా మేస్త్రీలకు, రోజువారీ కూలీలకు మంచి గిరాకీని తెచ్చింది. అక్రమార్కులు వీరిని ఆశ్రయించి, పాత కరెన్సీ ఇచ్చి బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద నిలబెడుతున్నారు. ఇక మేస్త్రీలు, కూలీలు కూడా ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు రౌండ్ల పాటు బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు నిలబడి ఒక్కొక్కరు రూ. 12 వేల నుంచి రూ. 16 వేల వరకూ మారుస్తున్నారు. ప్రతిగా వారికి రూ. 1000 వరకూ కమిషన్ గా దక్కుతోంది. అక్రమార్కుల ఉపాయాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే, దీన్ని అడ్డుకోవడం ఎలాగో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

More Telugu News