: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ.. కిక్కిరిసిపోతున్న శివాలయాలు

తెలుగు రాష్ట్రాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి, సోమవారం ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పుణ్య స్నానాలతో గోదావరి, కృష్ణా నదీతీరాలు కళకళలాడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి తీరంలో స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే వేలాదిమంది భక్తులు స్నానాల కోసం తరలివచ్చారు. వలంధర్ రేవు భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నారు. పంచారామాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. భీమవరం సోమేశ్వర ఆలయం, పాలకొల్లు రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు బారులుదీరారు. కొవ్వూరు, నర్సాపురం, ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, కోటిపల్లి, మురమళ్ల, సోంపల్లి, అన్నవరం, అంతర్వేది ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. దైవనామ స్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీశైలం, మహానంది, యాగంటి, కాల్వబుగ్గ శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. యాదాద్రికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు బారులుదీరారు. తెల్లవారుజామునుంచే ఆలయాల్లో దీపారాధనలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూకట్టారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ వేయి స్తంభాల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహిస్తున్నారు.

More Telugu News