: నిండుకున్న నగదు... నశిస్తున్న ప్రజల ఓపిక... మోదీపై పెరుగుతున్న సామాన్యుని విమర్శలు!

గడచిన మంగళవారం నాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని, రెండు రోజుల పాటు అంటే, బుధ, గురువారాల్లో ఏటీఎంలు పనిచేయవని, శుక్రవారం నుంచి ప్రజలకు అన్ని సేవలూ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రెండు రోజులు పెద్ద మనసు చేసుకుని ప్రజలు సర్దుకోవాలని చెప్పారు. మోదీ నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకున్న సామాన్యుడు నల్లధనం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో రెండు రోజులు ఓపిక పట్టాడు. ఏటీఎంలలోకి నగదు రాలేదు. బ్యాంకుల ముందు క్యూ కష్టాలు తీరలేదు. మరో మూడు రోజులు గడిచాయి. పరిస్థితిలో మార్పు లేదు. ఈ ఉదయం ఆరు గంటల నుంచే బ్యాంకుల ముందు ప్రజల క్యూ మొదలైంది. తెరచుకోనే ఏటీఎంలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. దీంతో మోదీపై సామాన్యుల విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల పాటు పనులన్నీ వదులుకొని బ్యాంకుల చుట్టూ తిరిగామని, ఇంకా ఇలా తిరగలేమని స్పష్టం చేస్తూ, మోదీ నిర్ణయం తమను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఏటీఎంలు పనిచేయకపోవడం, బ్యాంకులు ఇస్తున్న రూ. 2 వేల నోటును మార్చుకునే మార్గాలు లేకపోవడం ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇక మూడు రోజుల నాడు బ్యాంకులకు వచ్చిన అరకొర నగదు నేడు పూర్తిగా నిండుకున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే, ఉదయం నుంచి బ్యాంకు గేట్ల ముందు పడిగాపులు పడుతున్న ప్రజలు మరింతగా విమర్శించడం ఖాయం. ముందస్తు ఏర్పాట్లు సక్రమంగా చేసుకోకుండా నోట్ల రద్దును ప్రకటించడమే ఇందుకు కారణమని, రూ. 2 వేల విడుదలపై చూపిన శ్రద్ధ, రూ. 500 నోట్ల విడుదలపై చూపితే బాగుండేదని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు జరిగి నేటికి ఐదు రోజులు. మరో మూడు వారాలు ఆగితేనే ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఆర్థిక మంత్రి జైట్లీ మరో బాంబు పేల్చారు. అంటే రెండు మూడు రోజుల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని చెప్పిన మాటలు ఇప్పడు రెండు మూడు వారాలయ్యాయి. ఇక రెండు మూడు వారాలకైనా పూర్వపు స్థితికి బ్యాంకులు చేరుతాయా? అంటే అదీ డౌటే! రెండు మూడు నెలలైనా ప్రజల కరెన్సీ కష్టాలు తీరబోవని, సాధారణ చిల్లర దుకాణాల్లో రూ. 2 వేల నోటుకు చిల్లరిచ్చే పరిస్థితి ఇప్పట్లో చూడలేమని నిపుణులు భావిస్తున్నారు. అంటే ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరవేమో!

More Telugu News