: 500, 1000 నోట్ల రద్దుపై పాకిస్థాన్ నిపుణుల అభిప్రాయమిదే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ నిపుణులు సమర్ధించారు. భారత్ తో పాటు పాకిస్థాన్ లో కూడా మీడియా చర్చల్లో మోదీ నిర్ణయం ప్రధాన ఎజెండాగా మారింది. దీంతో కరెన్సీ రద్దు నిర్ణయంపై జరిగిన చర్చల్లో 500, 1000 రూపాయల నోట్ల రద్దును అంతా స్వాగతించారు. భారత్ లాంటి అతిపెద్ద దేశంలో అవినీతిని అంతం చేయాలంటే ఇంతకు మించిన మంచి నిర్ణయం లేదని పేర్కొన్నారు. ఇంత వరకు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి చేసేవారు 500, 1000 రూపాయల నోట్లను ప్రజల నుంచి దోచుకుని, దాచుకునేవారని అన్నారు. ఇప్పుడు సాధారణ ప్రజానీకం నుంచి లంచం తీసుకోవాలంటే 100 రూపాయల నోట్లు తీసుకోవాలని, అలా ఎన్ని నోట్లు తీసుకోగలరు, వాటిని ఎంతసేపు లెక్కపెట్టగలరని వారు ప్రశ్నించారు. వాటిని దాచుకోవడం కూడా కష్టమని అన్నారు. ప్రపంచ దేశాల కరెన్సీని పరిశీలిస్తే... అమెరికా ఈ రోజు వరకు 100 డాలర్ల నోటు కంటే పెద్ద కరెన్సీని ముద్రించడం లేదని అన్నారు. బ్రిటన్ 50 పౌండ్ల కంటే ఎక్కువ నోటును వినియోగం లోకి తీసుకురావడం లేదని వారు గుర్తుచేశారు. ఈ నిర్ణయాలే ఆయా దేశాల్లో అవినీతిని పరోక్షంగా నియంత్రించాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ నోట్లను భారత్ కూడా రద్దు చేసి, కేవలం 100 రూపాయలు, అంతకంటే తక్కువ నోట్లతో నడిపిస్తే ... డబ్బు విలువ తగ్గి ఇతర విలువలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు.

More Telugu News