: ముందు చాటింగ్, ఆపై డేటింగ్, అనంతరం చీటింగ్... పోలీసుల అదుపులో హైటెక్ కి'లేడి'!

ఈజీమనీ కోసం అడ్డదారులు తొక్కుతున్న వారిలో పురుషులతో పాటు స్త్రీల సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. డేటింగ్ సైట్లలో అనేక పేర్లతో ప్రొఫైల్స్ పెట్టి, తన వలలో పడ్డవారిని బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ హైటెక్ కిలేడీని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, చైతన్యపురి ప్రాంతానికి చెందిన నిందితురాలు క్యూటీ 27, వైశాలి 33, స్మైలీ 31 తదితర పేర్లతో డేటింగ్ సైట్ల ద్వారా చాటింగ్ చేసేది. ఆ సైట్లలో తనను కాంటాక్ట్ అయ్యే వారికి ఫోన్ నంబర్ ఇస్తూ, మీతో డేటింగ్ కు వస్తానని ఊరించేది. మల్టీ ప్లెక్సుల్లో నాలుగు సినిమా టికెట్లు బుక్ చేయాలని కోరి, తన ఈ-మెయిల్ ఐడీని పంపేది. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో 'ట్వూ' డేటింగ్ సైట్ లో క్యూటీ 27 పేరిట చాటింగ్ చేసింది. నాలుగు సినిమా టికెట్లు కావాలంటే, బుక్ చేసి మెసేజ్ ను ఆమెకు పంపాడు. ఇక్కడి నుంచే ఆమె తన పని ప్రారంభించింది. అతడి సెల్ నంబరు సహాయంతో ఫేస్ బుక్ లో అతడి ప్రొఫైల్ తెరచి, అందులో నుంచి కుటుంబ సభ్యుల ఫోటోలు డౌన్ లోడ్ చేసుకుని, బెదిరింపులకు దిగింది. తన ఖాతాలో రూ. 3,500 వేయకుంటే కుటుంబీకుల ఫోటోలను డేటింగ్ సైట్ లో పెట్టి ఫోన్ నంబర్ ఇస్తానని బెదిరించింది. దీంతో ఆ డబ్బును అతను జమ చేశాడు. ఆపై మరోసారి ఫోన్ చేసిన నిందితురాలు మరో రూ. 50 వేలను రెండు రోజుల్లో వేయాలని డిమాండ్ చేసింది. రెండు రోజుల్లో ఆ డబ్బు వేయకపోవడంతో, అతని కుటుంబ సభ్యుల చిత్రాలను డేటింగ్ సైట్ లో పెట్టి 'కాల్ ఆర్ ఎస్ఎంఎస్' స్టేటస్ ఉంచింది. దీంతో అతను ఫోన్ చేసి, కొద్ది రోజుల సమయం కావాలని బతిమాలడంతో, ఆ ఫోటోలను తీసి, మరికొన్ని ఫోటోలు, చిత్రాలను ఉంచింది. వాటిని చూసిన బాధితుడు, అక్కడ ఇచ్చిన ఫోన్ నంబరుకు ఫోన్ చేసి, తనకెదురైన అనుభవాన్ని చెప్పి, వారిని అలర్ట్ చేశాడు. స్మైలీ అనే పేరుతో తన స్నేహితుడికి ఆ అమ్మాయి పరిచయమైందని అతడు చెబితే విని అవాక్కయ్యాడు. ఈమె ఎంతమందిని మోసం చేసిందో తేల్చాలని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారు. ఈ కిలేడీ పేరు బట్టు రాజేశ్వరి. బాగా చదువుకుని కూడా సులభంగా డబ్బు కోసం ఇలా టెక్నాలజీని వాడుకుని అడ్డంగా బుక్కయి, ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది.

More Telugu News