: పాత నోట్ల మార్పిడికి 'ఎయిర్ లైన్స్'ను వాడుకున్న నల్లకుబేరులు... కనిపెట్టి చెక్ పెట్టిన మోదీ సర్కారు!

అక్రమార్కుల చేతుల్లోని నల్లధనాన్ని ఎందుకూ పనికిరాకుండా చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ వేసిన ఎత్తును చిత్తు చేద్దామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. పాత నోట్ల మార్పిడిలో అక్రమార్కుల మాయాజాలాన్ని కనిపెట్టిన కేంద్రం దానికి చెక్ పెట్టింది. నోట్లను మార్చుకునేందుకు అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకునేందుకు ఇష్టంగా లేని నల్లకుబేరులకు విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లు అచ్చొచ్చాయి. ఈ కౌంటర్లను వాడుకొంటూ, అక్రమార్కులు నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఇంటిల్లిపాదికీ కలిసి విదేశాలకు లక్షలు పోసి టికెట్లు కొనుగోలు చేసి, ఆపై వాటికి క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఆ డబ్బును తమ ఖాతాల్లోకి వేసుకోవాలని చూశారు. సాధారణంగా ఎయిర్ లైన్స్ కౌంటర్ల వద్ద నిత్యమూ రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకూ మాత్రమే స్పాట్ బుకింగ్ ద్వారా వచ్చేవి. కానీ, నోట్ల రద్దు ప్రకటన తరువాత రోజుకు రూ. 1 కోటికి పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ ఘరానా మోసాన్ని ఆదిలోనే పసిగట్టిన కేంద్రం, పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సిల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌంటర్ల దగ్గర పాత రూ. 500, రూ. 1000తో టికెట్లను కొనుగోలు చేసిన వారికి క్యాన్సిల్ సదుపాయం ఉండదని, వారికి ఎటువంటి రుసుమును తిరిగి ఇవ్వబోమని ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రకటించాయి.

More Telugu News