: పీవీ సింధును సత్కరించిన మధ్యప్రదేశ్ సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివ్ రాజ్ సింగ్ చౌహాన్

రియో ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధును మధ్యప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల చెక్కును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సింధు కృతఙ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా శివ్ రాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై, నల్లధనంపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన ప్రధాని నరేంద్రమోదీ, దేశంలోని క్రీడారంగంపై దృష్టి సారించాలని, అదే తరహాలో ప్రక్షాళన చేయాలని అన్నారు. స్పోర్ట్స్ అసోసియేన్లపై కూడా సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని, క్రీడలతో అనుబంధమున్న వారే క్రీడా పరిపాలక సంస్థల్లో ఉండాలని శివ్ రాజ్ సూచించారు. కాగా, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ఇండోర్ డివిజన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కైలాశ్ విజయ్ వార్గియాలు బీజేపీకి చెందినవారే. ఈ నేపథ్యంలో శివ్ రాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

More Telugu News