: మా తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారు: ఏవోబీకి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీలోని విద్యార్థులు

తమ తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఏవోబీకి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటీలోని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులు మ‌ృతి చెందిన విషయం విదితమే. మావోయిస్టులకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చి, వారు మత్తులోకి జారుకున్నాక పోలీసులు కాల్పులు జరిపారని పౌరహక్కుల నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో అసలు ఏమి జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం నిజనిర్థారణ కమిటీ ఒకటి అక్కడికి వెళ్లింది. ఈ కమిటీలో విద్యార్థులు కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లిన ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది. కమిటీ పర్యటన, సభ్యుల వివరాలను ఏపీ, ఒడిశా డీజీపీలకు ముందే చెప్పామని, అయినప్పటికీ, తమకు చెప్పలేదంటూ విశాఖపట్టణం ఎస్పీ అంటున్నారన్నారు. ఈ విషయమై తమ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని కమిటీలోని విద్యార్థులు వాపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో సేకరించిన వివరాలను హైదరాబాద్ లో వెల్లడిస్తామని ఆ కమిటీ పేర్కొంది. కాగా, ఏవోబీలో మావోల కోసం పోలీసులు మాటు వేసిన ప్రాంతంలో మద్యం సీసాలు, కండోమ్ లు ఉండడాన్ని గుర్తించినట్లు నిజ నిర్థారణ కమిటీ పేర్కొంది.

More Telugu News