: పాకిస్థాన్‌ నుంచి వస్తోన్న నకిలీ నోట్లను అరికట్టవచ్చు: రాజ్‌నాథ్‌ సింగ్

న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్లను అరిక‌ట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బలియా జిల్లాలో ఏర్పాటుచేసిన పరివర్తన్‌ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... పాత‌నోట్ల‌ను ర‌ద్దు చేసి కొత్త నోట్ల‌ను తీసుకురావ‌డం దేశంలో అవినీతిపై జరిపిన సర్జికల్‌ స్ట్రయిక్సేన‌ని ఆయ‌న అన్నారు. పాకిస్థాన్ ప్రోత్సాహంతో దేశంలోకి న‌కిలీ నోట్లు వ‌చ్చి ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కి ప్రోత్సాహం ల‌భిస్తోంద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఈ చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. న‌రేంద్ర‌ మోదీ దేశ‌ చరిత్రలోనే చారిత్రాత్మ‌కంగా నిలిచే ప్ర‌క‌ట‌న చేశార‌ని రాజ్ నాథ్ అన్నారు. దేశంలో అవినీతికి పాల్ప‌డాలంటే అక్ర‌మార్కులు భ‌య‌ప‌డిపోయే విధంగా ఈ ప్ర‌క‌ట‌న ఉంద‌ని అన్నారు. పాత‌నోట్ల‌ను ర‌ద్దు చేసి కొత్త నోట్లు తీసుకొస్తుండ‌డంతో స్వ‌ల్ప‌కాలికంగా ప్ర‌జ‌లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా భవిష్య‌త్తులో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో లాభ‌ప‌డుతుంద‌ని చెప్పారు. పాక్ ప్రోత్సాహంతో దేశంలోకి వ‌స్తోన్న నకిలీ కరెన్సీ దేశ‌ ఆర్థిక వ్యవస్థను, ఉగ్ర‌వాద కార్య‌కపాల‌ను ప్రేరేపించ‌డ‌మే కాకుండా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుంద‌ని, కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో వారి చ‌ర్య‌ల‌ను అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు. అలాంటి శక్తుల్ని ఇటువంటి నిర్ణ‌యాల‌తో బలహీనపరచ‌వ‌చ్చ‌ని, అందుకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు.

More Telugu News