: పెద్ద నోట్లను స్వీకరిస్తున్న విజయవాడ వస్త్ర వ్యాపారులు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో కస్టమర్ల నుంచి పెద్ద నోట్లను తీసుకోవడాన్ని దేశ వ్యాప్తంగా వ్యాపారులు తిర‌స్క‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, విజ‌య‌వాడ‌లో వ‌స్త్ర వ్యాపారులు పెద్ద నోట్లు త‌మ షాపింగ్‌మాల్స్‌లో చెల్లుతాయ‌ని చెబుతున్నారు. దీంతో అక్క‌డి వ​న్‌ టౌన్‌ లోని వస్త్రలత కాంప్లెక్స్‌కి క‌స్ట‌మ‌ర్లు క్యూ క‌డుతున్నారు. వ‌స్త్రాల‌ కొనుగోళ్లు సైతం పెరిగాయి. పెద్ద నోట్ల‌ను స్వీక‌రిస్తోన్న ఏకైక దుకాణం కావ‌డంతో అక్క‌డ క‌స్ట‌మ‌ర్ల సంద‌డి నెల‌కొంది. వ‌చ్చేనెల 31 వర‌కు బ్యాంకుల్లో పాత‌నోట్ల‌ను డ‌బ్బును డిపాజిట్ చేసుకోవ‌చ్చ‌ని కేంద్రం చెప్పిన అంశాన్ని వ్యాపారులు దృష్టిలో ఉంచుకొని పెద్ద నోట్ల‌ను స్వీక‌రిస్తూ తమ వ్యాపారాన్ని కొన‌సాగిస్తున్నారు. అక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బు మిన‌హా స‌క్ర‌మంగా సంపాదించిన డ‌బ్బు ఎంత‌యినా డిపాజిట్ చేసుకోవ‌చ్చని కేంద్రం చెప్పిన అంశాన్ని గుర్తు చేస్తూ.. తాము బిల్లులు ఇచ్చి చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నాం కాబట్టి త‌మ డ‌బ్బును బ్యాంకుల్లో జ‌మ‌చేసుకునే వేళ త‌మ‌కు ఇబ్బందులు ఉండవని వ్యాపారులు చెబుతున్నారు. విజ‌య‌వాడ‌లోని వేరే ప్రాంతాల్లోని హోల్‌సేల్ మార్కెట్ల‌లో మాత్రం పెద్ద నోట్ల‌ను కొంద‌రు వ్యాపారులు మాత్ర‌మే స్వీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌లు ప్రాంతాల్లో చిల్ల‌ర దొర‌క్క ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.

More Telugu News