: బ్యాంకుల్లో కొత్తనోట్లు అందుకొని మురిసిపోయిన వినియోగ‌దారులు

పాతనోట్ల‌ను మార్చుకోవ‌డానికి, త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుని డిపాజిట్ చేసుకోవ‌డానికి బ్యాంకుల ముందు వినియోగ‌దారులు ఉద‌యం నుంచే క్యూక‌ట్టిన విష‌యం తెలిసిందే. కొద్ది సేప‌టి క్రితం నుంచి వారు కొత్త నోట్ల‌ను అందుకుంటున్నారు. రెండు వేలు, ఐదు వంద‌ల కొత్త నోట్ల‌ను తీసుకొని మురిసిపోతున్నారు. వాటి డిజైను, రంగు గురించి మాట్లాడుకుంటూ క‌నిపిస్తున్నారు. నిన్న వంద నోట్ల కోసం ఎన్నో పాట్లు ప‌డిన ప్ర‌జ‌లు ఈ రోజు బ్యాంకుల్లో వంద నోట్ల క‌న్నా రెండు వేల నోట్ల‌నే తీసుకోవ‌డానికి ఎంతో ఆస‌క్తి చూప‌డం గ‌మ‌నార్హం. వారు మీడియాతో మాట్లాడుతూ న‌ల్ల‌ధ‌నం నిరోధానికి ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు. ఇబ్బందులు ప‌డిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. ప్రైవేటు బ్యాంకుల్లో నోట్ల మార్పిడి జ‌రుగుతున్నప్పటికీ విజ‌య‌వాడ‌లోని ప‌లు ప్ర‌భుత్వ బ్యాంకుల్లో ఇప్ప‌టికీ కొత్త నోట్లు అంద‌లేద‌ని స‌మాచారం. ప‌లు ప్ర‌భుత్వ బ్యాంకులు కేవ‌లం డిపాజిట్లు మాత్ర‌మే చేసుకుంటున్నాయి.

More Telugu News