: భారత ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోయింది: విదేశీ మీడియా

దాదాపు రూ. 14 లక్షల కోట్ల విలువైన కొనుగోలు శక్తి ఉండి, ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ గా ఉన్న భారతావనిలో నగదు రహిత భవిష్యత్ ప్రస్తుతానికి అంత మంచిది కాదని, విదేశీ కంపెనీలు అమ్మకాలు సాగక నష్టపోతాయని, నూతన పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని విదేశీ మీడియా అభిప్రాయపడింది. అమెరికాలో 1873లో సిల్వర్ డాలర్ ను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయంతో, మోదీ సర్కారు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని పోలుస్తూ, ఆపై శతాబ్దం తరువాతే అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా నిలిచిందని, ఇప్పుడు ఇండియా పరిస్థితి కూడా అంతేనని అంచనా వేసింది. దేశంలో చలామణిలో ఉన్న రూ. 16.4 లక్షల కోట్ల కరెన్సీలో 86 శాతం పెద్ద నోట్లేనని, వీటి రద్దుతో నగదు సంక్షోభం ఏర్పడనుందని అంచనా వేశాయి. ఇండియా అధికంగా ఫిజికల్ మనీపై ఆధారపడి వుందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, 17 సంవత్సరాల క్రితం పరిస్థితితో పోలిస్తే, చలామణిలో 9 రెట్లు అదనంగా కరెన్సీ ఉందని వెల్లడించింది. ప్రజల వద్ద ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను బ్యాంకుల్లో ఇచ్చి చిన్న డినామినేషన్ నోట్లను తీసుకోవచ్చని ప్రకటించినప్పటికీ, ఇదో సుదీర్ఘ ప్రక్రియగా సాగనుందని 'బ్లూమ్ బర్గ్' అభిప్రాయపడింది. ప్రస్తుతానికి ప్రజలు ఓ చిన్న షాంపూ సాచెట్ నుంచి, ఓ ఫ్రిజ్, ఎల్ఈడీ టీవీ, స్మార్ట్ ఫోన్ లేదా అపార్టుమెంట్ కొనుగోలునూ వాయిదా వేసుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొందని వెల్లడించింది. ఇండియాలోని పట్టణ ప్రాంతాల్లోని 69 శాతం మంది ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం మంది ఉద్యోగులు, కూలీలకు నగదు వేతనాలే లభిస్తున్నాయని గుర్తు చేస్తూ, వీరందరికీ చెల్లింపులు ఆలస్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని, ప్రతి కుటుంబానికీ బ్యాంకు ఖాతా, ప్రతి ఉద్యోగికీ ఖాతాలో వేతనం లక్ష్యాలు ఇప్పటికీ ఇండియాలో నెరవేరలేదని తెలిపింది. మోదీ తీసుకున్న నిర్ణయంతో అత్యధికంగా నిర్మాణ రంగం నష్టపోనున్నదని అంచనా వేసింది. గృహాలు, స్థిరాస్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయని పేర్కొంది. ఇది డెవలపర్లను కష్టాల్లోకి నెట్టినప్పటికీ, మధ్యతరగతికి కొనుగోలు అవకాశాలను దగ్గర చేస్తుందని వివరించింది.

More Telugu News