: బ్యాంకు డిపాజిట్లపై ఐటీ కన్ను... బెండు తీసేందుకు సిద్ధం!

నేటి నుంచి బ్యాంకుల్లో పాత కరెన్సీని డిపాజిట్ చేసుకోవచ్చని భావించి బ్యాంకులకు పెద్ద మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్లాలని భావిస్తున్నారా? బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే ప్రతి రూపాయిపైనా ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నవారు (వార్షికాదాయం రూ. 2.5 లక్షలు) బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే భయపడాల్సిన అవసరం లేదని, పన్ను పరిధిలో ఉన్నవారు వేసే ప్రతి రూపాయినీ ఐటీ రిటర్నుల దాఖలుతో సరిపోల్చి చూస్తామని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా వెల్లడించారు ఖాతాదారు ఐటీ రిటర్నుల సమయంలో వెల్లడించిన వివరాలతో తాజా డిపాజిట్లు సరిపోలకుంటే, అది పన్ను ఎగవేతేనని, 200 శాతం పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేశారు. మహిళలు రూ. 2.5 లక్షల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఒకేసారి 2 లేదా 3 లక్షల రూపాయలు అంతకుమించిన డబ్బును డిపాజిట్ చేసేందుకు తెస్తే, వివరాలను ఐటీ శాఖ పరిశీలిస్తుందని అన్నారు. డిసెంబర్ 30 వరకూ రెండున్నర లక్షలకు పైబడిన అన్ని డిపాజిట్ల వివరాలనూ నిశితంగా పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు. మొత్తం నగదు మార్పిడికి నాలుగు వారాల వరకూ సమయం పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. తప్పుడు వివరాలు సమర్పించేవారిని చట్టం ముందు నిలిపి జరిమానాలు విధించడం ద్వారా పన్ను వసూళ్లను పెంచడమే తమ ఉద్దేశమని ఆయన అన్నారు.

More Telugu News