: భారతీయ వనితలా చీరకట్టులో ఆకట్టుకున్న బ్రిటన్ ప్రధాని.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రభంజనం... ఇంకోవైపు ఇండియాలో నల్లధనంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం... ఈ రెండూ ఈ సమయంలో లేకుండా వుంటే కనుక బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే భారత్ లోని సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసేవారని, సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను కీర్తించేవారని పలువురు పేర్కొంటున్నారు. వారంతా అలా అనడానికి కారణం ఏంటంటే... బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం థెరెస్సా మే తొలి యూరపేతర విదేశీ పర్యటన భారత్ లోనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం భారత్ లో అడుగుపెట్టిన ఆమె, సోమవారం ప్రధాని మోదీతో పలు ఒప్పందాలు చేసుకున్నారు. మంగళవారం కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని హలసూరు సోమేశ్వరాలయానికి వచ్చారు. ఒక దేశానికి ప్రధాని అయిన థెరెస్సా మే, భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, అద్భుతమైన చీరకట్టులో దేవాలయానికి వచ్చారు. దేవాలయంలో చెప్పులు లేకుండానే నడిచారు. అచ్చమైన భారతీయ వనితలా హుందా ఉట్టిపడే చీరకట్టులో ఆమె దర్శనమిచ్చిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ట్రంప్ గెలుపు, 500, 1000 రూపాయల కరెన్సీ రద్దు నిర్ణయం కంటే బ్రిటన్ ప్రధాని థెరెస్సా మే చీరకట్టే భారతీయులను అమితానందానికి గురిచేసింది’ అని కీర్తించారు.

More Telugu News