: చైనాలో నటుల భద్రత కోసం చాలా చర్యలు తీసుకుంటారు!: సోను సూద్

కన్నడ సినిమా 'మాస్తీగుడి' షూటింగ్ లో ఇద్దరు యువనటులు మృత్యువాత పడటంపై నటుడు సోనూ సూద్‌ విచారం వ్యక్తం చేశాడు. ముంబైలో సోనూ సూద్ మాట్లాడుతూ, భారత చలనచిత్ర పరిశ్రమలో ఇది అత్యంత విషాదకర ఘటన అని అన్నాడు. మనదగ్గర భద్రతా ప్రమాణాలు పాటించరని అన్నాడు. ఆ వీడియో చూశానని చెప్పిన సోనూ సూద్, ‘ప్రమాద ఘటన నన్ను చాలా బాధించింది. అది పూర్తిగా బాధ్యతారాహిత్యం. ఈత రాదని చెప్పినా వారిని నీటిలోకి ఎలా దూకమన్నారో నమ్మశక్యంగా లేదు. కనీస భద్రతా ప్రమాణాలను కూడా చిత్ర యూనిట్‌ పాటించలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నటించిన చాలా సినిమాల్లో కూడా ఇలాగే కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని పేర్కొన్నాడు. అదే చైనాలో అయితే అలా కాదని, నటుల భద్రత కోసం చాలా చర్యలు తీసుకుంటారని అన్నాడు. హాలీవుడ్ స్టార్ జాకీ చాన్‌ తో కలిసి ‘కుంగ్‌ ఫూ యోగా’ షూటింగ్ లో ప్రతీరోజూ అంబులెన్స్‌, డాక్టర్‌ కచ్చితంగా సెట్‌ లో ఉండాల్సిందేనని, నటులకు ఏం జరిగినా వెంటనే వారు ప్రతిస్పందిస్తారని అన్నాడు. మనదగ్గర డాక్టర్లు, అంబులెన్సుల సంగతి పక్కనపెడితే... కనీసం భద్రతా ప్రమాణాలు కూడా ఉండవని తెలిపాడు. కాగా, చైనాలో యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ సినిమాలు ఎక్కువగా రూపొందుతాయన్న సంగతి తెలిసిందే.

More Telugu News